ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్ర రాజధాని స్థానంలో అమరావతి పేరును అధికారికంగా చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఇటీవల జరిగిన 47వ సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది. ఇటీవల భారత త్రివిధ దళాలు విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. దేశ భద్రత కోసం సైనికులు చేసిన సాహసోపేతమైన చర్యలను కొనియాడింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతిపై కేబినెట్‌లో చర్చించారు. రాష్ట్రంలోని తీరప్రాంత భద్రతను మరింత పటిష్టం చేయడం, రక్షణ రంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సమగ్ర సమీక్ష నిర్వహించారు. మరోవైపు మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వేట నిషేధ సమయంలో వారికి అందించే ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో మెగా ఈవెంట్స్‌ను నిర్వహించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని మున్సిపల్ శాఖ పరిధిలో 281 అభివృద్ధి పనులను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇది ఉపయోగపడనుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న 3 బిల్లులను ఉపసంహరించుకునే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం అంగీకరించింది. అయితే ఆ బిల్లులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.