పాక్ ప్రధాని సంచలన ఆరోపణ
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని ఒక సాకుగా చూపి భారత్ తమ దేశంపై దాడికి పాల్పడిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తమ దేశ చారిత్రక విజయమని అభివర్ణించారు. భారత దురాక్రమణకు తమ సైన్యం సమర్థవంతంగా బదులిచ్చిందని ప్రశంసించారు. కొన్ని రోజుల పాటు కొనసాగిన తీవ్ర సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం భూమి, గాలి, సముద్ర మార్గాల ద్వారా అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయడానికి భారత్, పాకిస్థాన్ అంగీకరించిన కొన్ని గంటలకే షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన ప్రసంగంలో జాతీయవాద అంశాలను ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన ాామా చర్య విద్వేషం, దురాక్రమణ, మత మూర్ఖత్వంపై జరిగింది. ఇది మా సూత్రాలకు, గౌరవానికి దక్కిన విజయం. ఒక గౌరవప్రదమైన దేశానికి తగిన శత్రువుతో మేం దీన్ని చేశాం. ఇది కేవలం సాయుధ బలగాల విజయం మాత్రమే కాదు, మొత్తం జాతి విజయం అని అన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం ఇస్లామాబాద్ చొరవతో జరిగిన దౌత్యపరమైన అవగాహన కాదని, పాకిస్థాన్ సైనిక పరాక్రమం వల్లే సాధ్యమైందని షరీఫ్ తన టెలివిజన్ ప్రసంగంలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు.శత్రువుకు బాగా అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలని మేం నిర్ణయించుకున్నాం అని ఆయన ప్రకటించారు. పాకిస్థాన్ ఆత్మగౌరవం, నిజాయితీ కలిగిన దేశం అనడానికి ఈ ఒప్పందమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తమ సాయుధ బలగాలు భారత్ వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలను ధ్వంసం చేశాయని షరీఫ్ ఘనంగా ప్రకటించారు. అయితే, ఈ ఆరోపణలను భారత అధికారులు కల్పితాలుగా కొట్టిపారేశారు.
దాదాపు 20 నిమిషాల తన ప్రసంగంలో షరీఫ్ మొత్తం విషయాన్ని మార్చివేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. పహల్గామ్ ఘటనను సాకుగా చూపి భారత్ తమపై అన్యాయమైన యుద్ధం్ణ ప్రకటించిందని, పాకిస్థాన్‌ను బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. భారత బలగాలు పౌరులు, మసీదులు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ తప్పుడు ప్రచారంగా ఖండించింది. వాస్తవానికి, క్షేత్రస్థాయి దృశ్యాలు భారత వైమానిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని, మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చూపించాయి. ఇది షరీఫ్ వాదనలకు విరుద్ధంగా ఉంది. అంతేకాకుండా కాల్పుల్లో పాకిస్థాన్ పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతీకార చర్యలు పద్ధతి ప్రకారం చేపట్టామని భారత ప్రభుత్వం తెలిపింది.