Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్ఫూర్తి కలిగించని సి.డబ్ల్యు.సి. సమావేశం

విద్వేషాన్ని నింపుతున్న బీజేపీని ఎదిరించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని అన్ని పార్టీలూ గుర్తించాయి. కాంగ్రెస్‌ లేని ప్రతిపక్ష కూటమివల్ల ప్రయోజనం లేదన్న అభి ప్రాయమూ బలంగానే ఉంది. ప్రతిపక్షంలోని కొందరు నాయకులు తామే జాతీయ నాయకులుగా ఎదగాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అయితే ఎంత బలహీనపడ్డా దేశమంతా ఏదో ఒక మేరకు అస్తిత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటే. కాంగ్రెస్‌ సమస్యల్లా సమర్థమైన, ప్రభావశీలమైన నాయకత్వం లేకపోవడమే. ఈ సంక్లిష్ట దశలోనే శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమా వేశం పూర్తిగా కాంగ్రెస్‌ సంప్రదాయం ప్రకారమే జరిగింది. 2019 సార్వ త్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైనందుకు బాధ్యత తీసు కుంటూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్నారు. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కూడా ఆయన సూచించారు. కానీ కాంగ్రెస్‌ సోనియా గాంధీనే మళ్లీ ఏడాదిపాటు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించి ఊరుకుంది. ఆ ఏడాది గడువు తీరిపోయి మరో ఏడాది గడిచింది. గత జూన్‌లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నా రెండో దశ కరోనా విజృభించినందువల్ల సాధ్యం కాలేదు. సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు పూర్తి కాలం పని చేసే అధ్యక్షులు కావాలనీ, పార్టీకి జవసత్వాలు కల్పించాలని కోరుతూ 23 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు గత ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇందిరా గాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌ నడుస్తున్న తీరు పరిశీలిస్తే సీనియర్‌ నాయకులు ఇలా లేఖ రాయడం సాహసం కిందే లెక్క. ఈ లేఖ రాసిన వారిలో మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, కాగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, దాడాపు డజను మంది కేంద్ర మాజీ మంత్రులూ ఉన్నారు. ఈ లేఖ మీడియాలో సంచలనం కలిగించింది కానీ కాంగ్రెస్‌ అధిష్ఠానం కిమ్మనలేదు. ఆ తరవాత కూడా కపిల్‌ సిబల్‌, గులాం నబీ ఆజాద్‌ లాంటి వారు అనువైనప్పుడల్లా నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నారు. ఈ లేఖ రాసిన సమయంలో గులాం నబీ ఆజాద్‌ రాజ్యసభలో ప్రతిపక్ష నాయ కుడిగా ఉండేవారు. ఈ లేఖ విషయంలో సోనియా అభిప్రాయం నిగూఢ రహస్యమే. అన్ని పరిణామాల మీద వ్యాఖ్యానించే ధోరణి సోనియాకు ఎన్నడూ లేదు. ఆ పని చేస్తున్నది ఇప్పటికీ రాహుల్‌ గాంధీనే. ప్రియాంకా గాంధీ సైతం ఇటీవలి కాలంలో బీజేపీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌లో అనుభవజ్ఞులైన నాయకులు చాలా మందే ఉన్నప్పటికీ పార్టీ వైఖరినో, వాణినో వినిపిస్తున్న సీనియర్‌ నాయకులు దాదాపుగా లేరు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అరుదుగానైనా నోరువిప్పితే కాంగ్రెస్‌ పార్టీపై ఆధిపత్యం కొనసాగిస్తున్న కుటుంబాన్ని పొగడడంతో సరిపెట్టుకుంటారు. సోనియా గాంధీ సామర్థ్యం మాట ఎలా ఉన్నా ఆమె రోజువారీ రాజ కీయాల్లో క్రియాశీలంగా ఉండే తత్వం ఉన్న వారు కాదు. ఆ స్థానాన్ని రాహుల్‌ గాంధీయే భర్తీ చేస్తున్నారు. గత మార్చి, ఏప్రిల్‌లో అస్సాం, బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు జరిగిన ఎన్నికలలో ఈ ఏర్పాటుకాంగ్రెస్‌కు ఒరగబెట్టింది ఏమీలేదు. 2004, 2009 ఎన్నికలలో సోనియా నాయకత్వం కాంగ్రెస్‌కు కేంద్రంలో అధికారం సంపా దించి పెట్టిందన్న అభిప్రాయం ఉంది గానీ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్య క్షులుగా ఉన్నప్పుడు గొప్ప విజయాలేమీ దక్కలేదనే వారున్నారు. 2019లో కాంగ్రెస్‌ కనీవినీ ఎరుగని పరాజయం పాలైనందుకు రాహుల్‌ నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయడం మెచ్చదగిన పరిణామమే కావొచ్చు. ఆ తరవాత కాంగ్రెస్‌ను పునరుజ్జీవింప చేయడానికి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా హయాంలో ఏం చేశారు అన్న ప్రశ్నకు జవాబు లేదు.
ఈ దశలో శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఏం సాధించిందో బేరీజు వేయాల్సిందే. కరోనా వల్ల ప్రత్యక్షంగా జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశం ఇదే. ఇందులో రెండు మూడు విషయాలు ప్రస్ఫుటంగా వినిపించాయి. మొదటిది జి 23 పేరుతో అసమ్మతి గళం వినిపించిన వారిని సోనియా అన్యాపదేశంగా మందలించారు. నాతో నేరుగా మాట్లాడ వచ్చు. మీడియా ద్వారా మాట్లాడవలసిన అవసరంలేదు అని ఆమె సుతిమెత్తని శైలిలో గట్టిగానే గదమాయించారు. రెండవది వచ్చే ఏడాది సెప్టెంబర్‌ కల్లా కాంగ్రెస్‌ వ్యవస్థాగత ఎన్నికలు పూర్తి అవుతాయని ప్రకటించారు. మూడవది మళ్లీ బాధ్యత స్వీకరించడానికి రాహుల్‌ సిద్ధంగా ఉన్నారు. సభ్యత్వ నమోదు, కింది స్థాయి నుంచి రాష్ట్రాలలో కాంగ్రెస్‌ మహాసభలు నిర్వహించి నాయకత్వాన్ని ఎన్నుకోవడంలాంటి లాంఛనాలు ఉంటాయి కనక దాదాపు ఏడాది సమయం పట్టడంలో వింతేమీ లేదు. అయితే సెప్టెంబర్‌లో జరిగే కాంగ్రెస్‌ మహాసభలో ఏం జరగబోతోందో శని వారం నాటి వర్కింగ్‌ సమావేశంలో సూచన ప్రాయంగా తెలిసిపోయింది. వడ్ల గింజలోనిదే బియ్యపు గింజ అన్నట్టుగా రాహుల్‌ గాంధీనే మళ్లీ అధ్య క్షుడిగా ఎన్నుకోబోతున్నారన్న సూచన చాలా స్పష్టంగా కనిపించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌ జిత్‌ చన్నీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బగేల్‌ బాహాటంగానే రాహుల్‌ గాంధీకే పట్టంగట్టాలని గట్టిగానే కోరారు. 2019లో కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానా నికి రాజీనామా చేసినప్పుడు ఉపసంహరించుకోవాలని ఎంతమంది అభ్య ర్థించినా రాహుల్‌ అంగీకరించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ కోరితే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమే అని ధ్వనించేట్టుగా మాట్లాడారు. రాహుల్‌ రాజీనామా తరవాత కాంగ్రెస్‌ సంక్షోభంలో కూరుకు పోయిన మాట వాస్తవం. గమనించదగిన మరో అంశం ఏమిటంటే తాను పూర్తి స్థాయి అధ్యక్షురాలినే అని సోనియా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు ఇందిరా గాంధీ హయాం తరవాత ఎలా జరుగు తున్నాయో అందరికీ తెలుసు. ఇందిరా గాంధీ కుటుంబం వారే పోటీలో ఉంటారు అనడం కన్నా పోటీ ప్రసక్తి లేకుండానే ఆ కుటుంబంలోని వారినే ఎన్నుకుంటారు అనడమే సబబుగా ఉంటుంది. వచ్చే ఏడాది సంస్థాగత ఎన్నికలు జరిగినా రాహుల్‌కు బాధ్యత అప్పగించాలని సోనియా అనుకుంటే అదే జరుతుంది. అసమ్మతివాదులు పెదవి విప్పే అవకాశమే లేదు అన డానికి సోనియా గాంధీని తాము వ్యతిరేకించడం లేదు అని గులాం నబీ ఆజాద్‌ శనివారం చెప్పడమే దీనికి నిదర్శనం. ఈ లోగా వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి అవుతాయి. ఒక్క గుజరాత్‌లో మాత్రమే వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు జరగవలసి ఉంది. శనివారం జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశం బలమైన ప్రతిపక్ష ఐక్యత సాధ్యమన్న సంకేతం ఇవ్వలేకపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img