Tuesday, May 13, 2025
Homeఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

గాయపడిన మరికొందరు
మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి.. అండగా ఉంటానని హామీ
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

పల్నాడు జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. వినుకొండ మండలం శివాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బొప్పాయి కాయలతో వెళుతున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. పనుల నిమిత్తం వీరు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గడ్డమీదపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు