దాయాది పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈరోజు ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు. వైసీపీ తరఫున వీర జవాన్ కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన తిరుగు పయనమయ్యారు.
ఇక, ఇప్పటికే వీర జవాన్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వ్యక్తిగతంగా మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తానని ప్రకటించారు.