. రాజరాజేశ్వరి ఆలయంలో సందడి
. వెదురు ఆకృతులు, హస్తకళలకు ఫిదా
. ఏఐజీ ఆసుపత్రిలో చిన్నారులకు పరామర్శ
విశాలాంధ్రహైదరాబాద్: తెలంగాణ, మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి అందాలభామల రాకతో మెరిసింది. 700 ఏళ్ల చరిత్రగల పిల్లలమర్రి అందాలకు ముద్దుగుమ్మలు ఫిదా అయ్యారు. తమ ఫోన్లలో ఫోటోలు క్లిక్‌మనిపిస్తూ సందడి చేశారు. 22 మందితో కూడిన మిస్ట్ వరల్డ్ పోటీదారుల బృందం పిల్లలమర్రిలోని విజయనగర కాలంనాటి రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించింది. సమీపంలోని పురావస్తుశాఖ మ్యూజియాన్ని వీక్షించింది. 16, 17, 18వ శతాబ్దం కాలం నాటి వస్తువులను, విగ్రహాలను అందగత్తెలు పరిశీలించారు. 3
4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పిల్లలమర్రి మర్రిచెట్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ మహావృక్షం ప్రాధాన్యత తెలియజేస్తూ భామల కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. మర్రిచెట్టు సంరక్షణ తీరుపై అధికారులు వారికి వివరించారు. వెదురుతో తయారు చేసిన బుట్టలు, అలంకరణ ఆకృతులు, హస్తకళా నైపుణ్యం, మహిళా సంఘాల హస్తకళలు, నేతన్నల గొప్పతనాన్ని, మగ్గాలతో నేసిన చీరలను వివిధ రకాల వంటకాలను ప్రత్యేక స్టాళ్లను సుందరీమణులు ఆసక్తిగా వీక్షించారు. గద్వాల, నారాయణపేట చేనేత చీరల డిజైన్లు వారిని ఆకట్టుకున్నాయి. అందగత్తెల కోసం పిల్లలమర్రిని అధికారులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వాల్ పెయింటింగ్, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనం, మహావృక్షం వద్ద ఆకర్షణీయమైన పూలమొక్కలు, ఫొటో షూట్‌కు అనుగుణంగా వ్యూ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. సుందరీమణుల కోసం భారీ బందోబస్తు చేశారు. పిల్లలమర్రి అందాలను అందాలభామలు వారి ఫోన్లలో బంధిస్తూ సరదాగా గడిపారు. పిల్లలమర్రి మహావృక్షం కింద గురుకుల పాఠశాలల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కాగా, మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు ఆంక్షలు విధించారు. 13 వందల మంది పోలీసులతో మూడంచల భద్రత ఏర్పాటు చేశారు. అందాల భామలకు స్వాగతం పలికేందుకు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.
ఏఐజీ ఆసుపత్రి రోగులకు ఆప్యాయ పలకరింపు
తెలంగాణలోని వివిధ ప్రముఖ, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. మెడికల్ టూరిజంలో భాగంగా గ్రూప్ బి1 మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు ఈ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి రోగులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న చిన్నారులతో గడిపారు. ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డా. నాగేశ్వర రెడ్డి వారికి చికిత్స విధానాలను, పరిశోధనల తీరును వివరించారు. ఆరోగ్య రంగంలో సాధించిన పురోగతిని, బ్రెస్ట్ వెల్‌నెస్, ‘గట్’ (జీర్ణ వ్యవస్థ), వంటి అంశాలను ప్రచారం చేయాలని అందగత్తెలకు సూచించారు. వైద్య రంగంలో వస్తున్న అధునాత మార్పులు, మహిళల్లో వస్తున్న వ్యాధుల గురించి వివరించారు. సుందరీమణులు ఆస్పత్రిలో అన్ని విభాగాలను సందర్శించారు. విదేశీ రోగులకు సదుపాయాలు తదితర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ ఆహారం, ఆరోగ్యంపై దృష్టిపెడితే సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుందన్నారు. విస్ వరల్డ్ పోటీదారులు కూడా తమ అభిప్రాయాలను నాగేశ్వరరెడ్డితో పంచుకున్నారు. ఐసీయూలోని చిన్నారులను పరామర్శించారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో తమ అనుభవాలను పంచుకున్నారు.
ఎకో పార్కుకు…
రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూరు… ఎక్స్‌పీరియం ఎకో ప్రెండ్లీ పార్కులో అందగత్తెలు సందడి చేశారు. పార్కులోని వివిధ జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతలను నిర్వాహకులు వారికి వివరించారు. కాగా, మిస్‌వరల్డ్ పోటీదారులు ఆదివారం సచివాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 వరకు అక్కడే ఉంటారు. సచివాలయంపై ప్రదర్శించే 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్‌లో తెలంగాణ చరిత్ర, అభివృద్ధిని వీక్షిస్తారు.