పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన టర్కీ
భారత మార్కెట్లో టర్కీ వస్తువులకు కష్టాలు
పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే (టర్కీ) దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపు ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మింత్రా, అజియో తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి టర్కీకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఃఆపరేషన్ సింధూర్ః సమయంలో టర్కీ బహిరంగంగా పాక్‌కు మద్దతు ప్రకటించింది. ఇది భారత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. ఫలితంగా, బాయ్‌కాట్ టర్కీ అనే నినాదం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, దేశీయ వ్యాపారులు టర్కీతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మింత్రాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇదే బాటలో, రిలయన్స్‌కు చెందిన ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ అజియో కూడా టర్కీకి చెందిన ప్రముఖ వస్త్ర బ్రాండ్లయిన కోటాన్, ఎల్సీ వైకికి, మావి వంటి వాటి అమ్మకాలను తమ సైట్లో నిలిపివేసింది. అంతేకాకుండా, టర్కీలో తమ సంస్థ కార్యకలాపాలను కూడా మూసివేసినట్లు రిలయన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఈ బహిష్కరణ కేవలం ఆన్లైన్ రిటైల్ సంస్థలకే పరిమితం కాలేదు. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్) కూడా పాకిస్థాన్‌కు మద్దతిస్తున్న టర్కీ, అజర్బైజాన్ దేశాలతో పర్యాటకంతో సహా అన్ని రకాల వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించింది. భారత ఎగుమతిదారులు, దిగుమతిదారులు, ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ రెండు దేశాల కంపెనీలతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని కెయిట్ సూచించింది.
ఇదిలా ఉండగా, భారత విమానాశ్రయాల్లో భద్రతా సేవలు అందిస్తున్న టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేసింది. ఈ పరిణామాలన్నీ ఇస్తాంబుల్ స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల విలువ పడిపోవడానికి కారణమవుతున్నాయి. మొత్తంగా, టర్కీ వైఖరి ఆ దేశ వాణిజ్య ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.