గ్లీసన్ స్కోరు 9 చాలా తీవ్రం, ఎందుకు దాచారని ప్రశ్న
ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్న ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. అయితే, ఈ రోగ నిర్ధారణ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. బైడెన్ ఆరోగ్యం గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు ఆయన కార్యాలయం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. గ్లీసన్ స్కోరింగ్ విధానంలో ఆయన క్యాన్సర్ తీవ్రతను అంచనా వేయగా, స్కోరు 9గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ స్కోరు క్యాన్సర్ వేగంగా వ్యాపించే అవకాశాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బైడెన్‌కు క్యాన్సర్ సోకిందన్న విషయం ఇన్ని రోజుల తర్వాత తెలియడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్లీసన్ స్కోరు 9కి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఇదే వైద్యుడు బైడెన్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇది కేవలం రాజకీయ అంశం కాదు, మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. క్యాన్సర్ విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు బయటకు వెల్లడించలేదు? ప్రజలకు దీని గురించి పూర్తి వాస్తవాలు తెలియాలి. కొందరు నిజాలు చెప్పడం లేదు, ఇది మరో పెద్ద సమస్యగా మారుతోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, జో బైడెన్ భార్య జిల్ బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తీవ్ర విమర్శలు చేశారు. జిల్ బైడెన్ ఒక నకిలీ వైద్యురాలు అంటూ ఆయన ఆరోపించారు. డాక్టర్ అయినప్పటికీ తన భర్తలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేకపోవడంపై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.