సుమారు 10 రోజుల ముందుగానే కేరళను తాకనున్న వైనం
జులై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయన్న అధికారులు
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు అందించింది. మరో నాలుగైదు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వార్తతో ఉపశమనం లభించనుంది. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి చురుగ్గా కదులుతూ, రాబోయే నాలుగు లేదా ఐదు రోజుల్లో కేరళ రాష్ట్రంలో ప్రవేశించేందుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే రుతుపవనాలు, ఈ ఏడాది మే నెలాఖరులోనే పలకరించనున్నాయి.
రుతుపవనాల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇవి జులై 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం ముందుగానే ఉండటంతో, వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి వర్షాలు సరైన సమయంలో కురిస్తే పంటలకు మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.