మంత్రి సత్య కుమార్ యాదవ్ చొరవతో హస్తకళల అభివృద్ధికి మార్గం సుగమం
కేంద్రం నుండి ధర్మవరం ప్రాజెక్ట్‌కు పచ్చజెండా
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇటీవల ఆయన కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన లేఖకు తగిన స్పందన లభించింది. సత్య కుమార్ యాదవ్ 30 ఏప్రిల్ 2025న కేంద్ర మంత్రికి లేఖ రాసి, ధర్మవరం లో ముడి పదార్థాల డిపో ఏర్పాటు కోసం ఇన్‌స్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ స్కీమ్ ఫర్ హ్యాండీక్రాప్ సెక్టార్ కింద ఆమోదం కోరారు. దీనికి స్పందనగా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ 13 మే 2025న అధికారికంగా ఉత్తరం రాసి, ఆ లేఖను సంబంధిత విభాగానికి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ఫార్వార్డ్ చేసినట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా ధర్మవరం హస్తకళల రంగానికి విశేషంగా మేలు జరగనుంది. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే, వేలాది మంది కళాకారులకు నాణ్యమైన ముడి పదార్థాలు తక్కువ ధరకు, సమయానికి అందుబాటులోకి వచ్చి వారి జీవనోపాధికి స్థిరత కలగనుంది. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందిస్తూ, ధర్మవరం కళాకారుల సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రంతో పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాం అని తెలిపారు.ఇది వోకల్ ఫర్ లోకల్ దిశగా ఒక గొప్ప అడుగు అని తెలిపారు. పట్టణ కళాకారులు కూడా హర్ష వ్యక్తం చేశారు.