పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులు పగటిపూట సైతం తమ కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా విమర్శించారు. నెదర్లాండ్స్‌కు చెందిన మీడియా సంస్థలకు ఇచ్చిన వరుస ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాద కార్యకలాపాల గురించి తమకు తెలియదని పాకిస్థాన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం రెండూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఆ దేశంలోని పెద్ద నగరాల్లోనే వారు పగటిపూట కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు ఎక్కడ ఉంటారో, ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారో, వారి మధ్య సంబంధాలు ఏమిటో అన్నీ మాకు తెలుసుఁ అని జైశంకర్ గట్టిగా వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని పాకిస్థాన్ నటించకూడదు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు అన్ని విధాలా సహకారం అందిస్తోంది. ముఖ్యంగా పాక్ సైన్యం సరిహద్దు ఉగ్రవాదంలో పూర్తిగా కూరుకుపోయిందిఁ అని ఆయన ధ్వజమెత్తారు. ఉగ్రవాదం, కశ్మీర్ అంశాలను భారత్ వేర్వేరుగా పరిగణిస్తుందని ఆయన స్పష్టం చేశారు.