54 మంది మృతి…
అనేకమందికి తీవ్ర గాయాలు
టెల్ అవీవ్: హమాస్ పై యుద్ధం పేరుతో ఇజ్రాయిల్ భీకర దాడులకు పాల్పడటం ద్వారా అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. తాజాగా సెంట్రల్ గాజాపై ఇజ్రాయిల్ వైమానిక దళం డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిరది. ఈ దాడి ఆదివారం రాత్రి గాజాలోని ఒక రద్దీ ప్రాంతంలో జరిగింది. అక్కడ పాఠశాలలు ఆశ్రయ కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ వివిధ కుటుంబాలు ఆశ్రయం పొందుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం ఈ పాఠశాలలో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని చెబుతోంది. అయితే ఈ వాదనపై స్థానికులు, అంతర్జాతీయ సంస్థలు సందేహం వ్యక్తం చేశాయి. ఈ దాడిలో మరణించిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. స్థానిక ఆసుపత్రుల నివేదికల ప్రకారం ఈ దాడిలో 54 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికులలో భయాందోళనలను రేకెత్తించింది. ఎందుకంటే పాఠశాలలు సాధారణంగా సురక్షిత ప్రాంతాలుగా పరిగణించబడతాయి. ఈ దాడి ద్వారా ఇజ్రాయిల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సామాన్య పౌరులు, ముఖ్యంగా పిల్లలు ఈ హింసలో బాధితులయ్యారు. కాగా ఐక్య రాజ్యసమితి (ఐరాస) సహా ఇతర మానవ హక్కుల సంస్థలు ఈ దాడిని ఖండిరచాయి. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. కాగా సోషల్ మీడియా వేదికగా దాడి చిత్రాలు వైరల్ అయ్యాయి. గత శుక్రవారం కూడా ఇజ్రాయిల్ సైన్యం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి జరిపింది. గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే డాక్టర్ తన 10 మంది పిల్లలతోపాటు ఇంట్లో ఉన్నప్పుడు ఈ దాడి జరగడంతో ఆ పిల్లల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. డాక్టర్ నజ్జర్‌తోపాటు ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే నజ్జర్ తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం దక్షిణ గాజా సమీపంలోని నాజర్ దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.