Thursday, May 29, 2025
Homeమహానాడుకు సర్వం సిద్ధం

మహానాడుకు సర్వం సిద్ధం

. నేటినుంచి కడపలో టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశాలు
. లక్షలాదిగా తరలి రానున్న తెలుగు తమ్ముళ్లు
. 5 వేల మంది పోలీసులతో భద్రత

విశాలాంధ్ర బ్యూరో – కడప : కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు సంబరం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. కడప నగరంలో తొలిసారి నిర్వహించే మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడిరచాయి. కడప శివారు పబ్బాపురం (కమలాపురం నియోజకవర్గం) వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహానాడుకు వెళ్లే ప్రారంభ ద్వారం, విమానాశ్రయం నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా సభా ప్రాంగణానికి వచ్చే మార్గం, కడప నగర వీధుల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కడప నగరం ఎటు చూసినా రోడ్డుకి ఇరువైపులా టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోయింది. పండగ వాతావరణం సంతరించుకుంది. మహానాడు ప్రాంగణం నుంచి 10 కిలోమీటర్ల పొడవున పులివెందుల, తాడిపత్రి, కర్నూలు, బద్వేలు, రాజంపేట, రాయచోటి మార్గాల్లో భారీ ఎత్తున స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. కూడళ్లను పసుపు జెండాలతో అలంకరించారు. దాదాపు 5 వేల మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. మహానాడు భద్రతను 15 మంది ఐపీఎస్‌ అధికారులు, 30 మంది అడిషనల్‌ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 200 మంది సీఐలు, ఎస్‌ఐలు ఈ విధుల్లో ఉన్నారు. మహానాడు బ్యానర్లు, కటౌట్లు ఫ్లెక్సీలు, హోర్డింగులు, జెండాలతో దారులన్నీ పసుపు మయమయ్యాయి. అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని సమీకరించడమే లక్ష్యంగా నేతలు పనిచేస్తున్నారు. రాయలసీమ వాసుల ఆకాంక్షలు నెరవేర్చేలా కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు మంత్రి, పార్టీ సీనియర్‌ నేత కింజారపు అచ్చెంనాయుడు తెలిపారు. మహానాడు ఏర్పాట్లపై సహచర మంత్రులు, కీలక నేతలతో జరిగిన సమావేశంలో రాయలసీమ డిక్లరేషన్‌ పై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఈనెల 29న జరిగే బహిరంగ సభకు 5 లక్షల మందికి పైగా తరలి వస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన మహానాడుకు భిన్నంగా కడప మహానాడు ఉంటుందని పేర్కొన్నారు. వేడుక ప్రాంగణంలో వివిధ కమిటీల సభ్యులైన మంత్రులు అచ్చెంనాయుడు, గొట్టిపాటి రవి, నారాయణ, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, పార్థసారథి, బీసీ జనార్దన్‌ రెడ్డి, వాసంశెట్టి సుభాష్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీలు అలపాటి రాజా, రాంగోపాల్‌ రెడ్డి తదితరులు సమీక్షించారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, పోలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మహానాడు విశేషాలు వెల్లడిరచారు. మంగళవారం ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభం అవుతుంది. అనంతరం పార్టీ చరిత్రను వివరిస్తూ రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఇటీవల కాలంలో మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తారు. ఉదయం 11. 30 నిమిషాలకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్వాగత ప్రసంగం, పార్టీకి సంబంధించి జమ, ఖర్చులపై కోశాధికారి నివేదిస్తారు. 11.50కి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం చేస్తారు. తొలిరోజు పార్టీ ప్రతినిధుల సభ జరుగుతుంది. సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ మౌలిక సిద్ధాంతాలపై నేతలు దిశా నిర్దేశం చేస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రూపొందించిన ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నివాళి, ఆరు సూత్రాల్లోని వివిధ అంశాలు, ఏడాదిపాలలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై విస్తృతంగా చర్చించి ఆమోదిస్తారని వారు వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తుండటంతో కడప నగరంలోని అన్ని హోటళ్లు, అతిథి గృహాలు, కళాశాలలు, స్కూళ్లు విడిది కేంద్రాలుగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు