భారత్‌లో 1009 కేసులు
. మొదటిస్థానంలో కేరళ
. దిల్లీలో 104 క్రియాశీల కేసులు
న్యూదిల్లీ : దేశంలో మరోసారి కరోనావైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దిల్లీలో 104 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఒక వారంలోనే 99 మంది దీని బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసుల సంఖ్య 400 దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా… వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకినట్లు సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ఇటీవల ఆసియా దేశాలు… ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడిరచారు. అవే ఉపరకాలను భారత్‌లో గుర్తించినట్లు ఇటీవల ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం గత వారం వెల్లడిరచింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచిన సమాచారం ప్రకారం రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసులు పరిశీలిస్తే… కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా… మహారాష్ట్ర (209), దిల్లీ (104), గుజరాత్ (83), తమిళనాడు (69), కర్నాటక (47), ఉత్తరప్రదేశ్ (15), రాజస్థాన్ (13), పశ్చిమబెంగాల్ 12, పుదుచ్చేరి 9, హర్యానా 9, ఆంధ్రప్రదేశ్ 4, మధ్యప్రదేశ్ 2, తెలంగాణ, గోవా, చత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. తాజాగా బీహార్‌లో ఒక కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కేసులు నమోదవుతున్నప్పటికీ… తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.