Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వ్యూహాత్మక భాగస్వామ్యంపై అమెరికా పాత్ర భేష్‌

ఆ దేశ ఎంపీల బృందంతో మోదీ
న్యూదిల్లీ : అమెరికా ఎంపీల బృందం శనివారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైంది. భారత్‌అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టవంతం చేయడంలో అమెరికా కాంగ్రెస్‌ ఇస్తున్న నిర్మాణాత్మక పాత్ర, మద్దతుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరస్పరం గౌరవించుకోవడాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటన విడుదల చేసింది. సెనెటర్‌ జాన్‌ కార్నిన్‌ నేతృత్వంలోని ఎంపీల ప్రతినిధి బృందంలో మైఖేల్‌ క్రాపో, థామస్‌ ట్యుబర్‌విల్లే, మైఖేల్‌ లీ, టోనీ గొంజేల్స్‌, జాన్‌ కెవిన్‌ ఎలిజీ సభ్యులుగా ఉన్నారని పీఎంఓ తెలిపింది. భారత్‌, భారతీయ అమెరికన్ల సెనెట్‌ కాకస్‌కు కార్నిన్‌ సహ వ్యవస్థాపకుడు, సహ అధ్యక్షుడు. అధిక జనాభా, విభిన్న జాతులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత్‌లో కోవిడ్‌19ను అద్భుతంగా ఎదుర్కొన్నట్లు ఎంపీల ప్రతినిధి బృందం ప్రశంసించినట్లు ఆ ప్రకటన వెల్లడిరచింది. ప్రజల అద్భుత భాగస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామిక విలువల ఆధారంగానే మహమ్మారిని క్రమపద్ధతిలో తగ్గించగలిగామని ప్రధాని మోదీ చెప్పారని వివరించింది. దక్షిణాసియా, ఇండో`పసిఫిక్‌ ప్రాంతాలు సహా పరస్పర ప్రయోజనాలు గల ప్రాంతీయ సమస్యలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్లు పేర్కొంది. రెండు వ్యూహాత్మక భాగస్వాముల మధ్య వ్యూహాత్మాక ప్రయోజనాల పెంపుపై చర్చలు జరిగాయని వివరించింది. ప్రపంచశాంతి, సుస్థిరత లక్ష్యంతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలన్న ఆకాంక్షను మోదీ, ప్రతినిధిబృందం వ్యక్తం చేశాయని తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల పెంపు, ఉగ్రవాదం, వాతావరణమార్పు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వంటి సమకాలీన అంతర్జాతీయ సమస్యలపై సహకారాన్ని పటిష్టవంతం చేయడంపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img