జపాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. టొకార దీవుల సమూహంలో గత రెండు వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకు అక్కడ ఏకంగా 900 సార్లు భూప్రకంపనలు నమోదవడంతో తీవ్ర ఆందోళన కలుగుతోంది. సగటున గంటకు మూడుసార్లకు పైగా భూమి కంపిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. బుధవారం కూడా ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కాసేపటికే వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ వరుస పరిణామాలతో అప్రమత్తమైన యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జపాన్ వాతావరణ సంస్థ అధికారి అయాటకా ఎబిటా ఈ వివరాలను ధృవీకరించారు.
జూన్ 23న ఒక్కరోజే అత్యధికంగా 183 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఁనిరంతరం భూమి కదులుతున్నట్లే అనిపిస్తోంది, ఏం జరుగుతుందోనని భయంగా ఉందిఁ అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. టొకార దీవుల్లో జనాభా తక్కువగా ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఇక్కడ మొత్తం 12 దీవులు ఉండగా, ఏడింటిలో మాత్రమే సుమారు 700 మంది ప్రజలు నివసిస్తున్నారు.
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండటంతో జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఇక్కడ ఏటా దాదాపు 1,500 ప్రకంపనలు నమోదవుతాయి. ఈ నేపథ్యంలో, సమీప భవిష్యత్తులో ఒక భారీ భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం ఇటీవలే దేశ ప్రజలను హెచ్చరించింది.