Friday, December 27, 2024
Homeపెచ్చరిల్లిన మతహింస

పెచ్చరిల్లిన మతహింస

ఇది బీజేపీ దుష్టపాలన ఫలితం

. ప్రతిఘటనకు అభ్యుదయశక్తుల ఐక్యత అనివార్యం
. 10న నిరసనలు, డిమాండ్స్‌ డే
. జాతీయ సమితి తీర్మానాలు వెల్లడిరచిన డి.రాజా

న్యూదిల్లీ : బీజేపీ దుష్టపరిపాలన ఫలితమే దేశంలో మతహింస పెచ్చరిల్లడానికి కారణమని భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) నిశితంగా విమర్శించింది. దేశంలో, ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న మత ఉద్రిక్తతలను ప్రతిఘటించేందుకు ప్రగతిశీల, అభ్యుదయశక్తులు అనివార్యంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నవంబరు 28, 29, 30 తేదీలలో న్యూదిల్లీ సీపీిఐ కేంద్ర కార్యాలయం అజయ్‌భవన్‌లో పార్టీ జాతీయసమితి సమావేశాలు జరిగాయి. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ప్రకాశ్‌ బాబు అధ్యక్షతన మూడురోజులు జరిగిన సమావేశంలో చేసిన తీర్మానాలను పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సోమవారం పత్రికాగోష్టిలో విడుదల చేశారు. దేశ రాజకీయ, ఆర్థిక పరిణామాలతోపాటు వచ్చే ఏడాది జరిగే సీపీఐ జాతీయ మహాసభలకు సంబంధించిన మార్గదర్శకాలపై డి.రాజా సమావేశాల్లో నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఈ నివేదికపై వివరణాత్మక చర్చ జరిగింది. ఉత్తరప్రదేశ్‌ సంభల్‌లో తలెత్తిన మతహింస గురించి ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీలో నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం
దిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నిర్మాణ కార్యకలాపాలపై ఆ నగరంలో నిషేధం విధించారు. ఈ కారణంగా నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారు ఉద్యోగాలు, వేతన నష్టాలకు గురవుతున్నారు. అందువల్ల నిర్మాణ కార్మికులకు తగిన ఆర్థిక సహాయం చేయాలని పార్టీ జాతీయ సమితి డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసింది. మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాల్లో ఎలాంటి మార్పూలేదు. ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 60,000 మందికిపైగా ప్రజలు శరణార్థ శిబిరాల్లో తలదాచుకున్నారు. మణిపూర్‌లో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తున్నది. అందువల్ల మణిపూర్‌ ప్రభుత్వం రాజీనామా చేయాలని సమావేశం తీర్మానించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) పథకం అమలులో ఎన్నో లొసుగులు, లోపాలు ఉన్నాయి. ఈ పథకం కింద ఉన్న అర్హులైనవారిజాబితా నుండి లక్షలాదిమంది కార్మికుల పేర్లు తొలగించారు. ఆధార్‌కార్టుల్లో తలెత్తిన సమస్యల వల్ల వేలాదిమంది కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు. ఈ లొసుగులన్నింటినీ సరిద్దాలి. ఈ పథకం కింద కార్మికులకు రోజుకు ఒక్కొక్కరికీ రూ.700 వంతున ఏడాదికి కనీసం 200 రోజులు పని ఇవ్వాలని సమావేశం తీర్మానం చేసింది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై మతహింస
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల చెలరేగుతున్న హింసాత్మక ఘటనల పట్ల సీపీఐ జాతీయ సమితి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేషం రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వే ఈ విధమైన చర్యలు కేవలం లౌకిక సూత్రాలతోపాటు సమానత్వం, న్యాయాలను ఉల్లంఘించడం మాత్రమేకాదు… బంగ్లాదేశ్‌ భిన్నమత సమాజ సహజీవన స్థిరత్వానికీ, మతసామరస్యతకూ పెద్ద బెడదగా మారుతుంది. అందువల్ల బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఆసరాగా చేసుకుని మనదేశంలో నిరసనల ముసుగులో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు మతోన్మాదశక్తులు లేదా అధికారపార్టీ చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా అన్ని ప్రగతిశీల, అభ్యుదయ, లౌకికవాద శక్తులు వ్యతిరేకించాలని సమావేశం మరో తీర్మానంలో పిలుపు ఇచ్చింది. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఏవిధమైన మతఘర్షణలు జరగకుండా చూడాలని, అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నివారించాలని సమావేశం కోరింది. అదేవిధంగా, దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల కారణంగా నష్టపోయే ప్రజలకు పునరావాసం కల్పించాలని, ఉత్తరాఖండ్‌లో క్రూర జంతువుల బారినపడి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని సమావేశం తీర్మానాలు చేసింది.
సీపీఐ శతాబ్ది సంవత్సర వేడుకలు
భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) శతాబ్ది సంవత్సర వేడుకల లోగోను డి.రాజా జాతీయ సమితి సమావేశాలలో ఆవిష్కరించారు. వంద సంవత్సరాల క్రితం పార్టీ వ్యవస్థాపక మహాసభలు జరిగిన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో తిరిగి అదేరోజున అంటే ఈనెల 26వ తేదీన సమావేశం నిర్వహించాలని జాతీయ సమితి నిర్ణయించింది.
కాన్పూర్‌ సమావేశం ద్వారా పార్టీ శతాబ్ది సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 2025 డిసెంబరు 26వ తేదీన సీపీఐ శతాబ్ది సంవత్సర వేడుకల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ, బహిరంగసభ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు