Wednesday, February 5, 2025
Homeసంపాదకీయంసంభల్‌, అజ్మీర్‌ కల్లోలంచంద్రచూడ్‌ చలవే

సంభల్‌, అజ్మీర్‌ కల్లోలంచంద్రచూడ్‌ చలవే

ఈ దేశంలో కింది కోర్టుల జడ్జీలు ఇచ్చే తీర్పులు గందరగోళంగా ఉంటున్నాయి. సంభల్‌ రగడ వ్యవహారంలో స్థానిక కోర్టు జడ్జి ఆదిత్య సింగ్‌ ఆ కేసు విచారణకు స్వీకరించడం ప్రశ్నార్థకంగా మారింది. సంభల్‌లో ప్రస్తుతం ఉన్న మసీదు కింద హరిహర మందిరం ఉందా లేదా అని తేల్చుకోవడానికి సర్వే నిర్వహించాలని ఆ న్యాయమూర్తి పురాతత్వశాఖకు నోటీసు జారీ చేశారు. అత్యున్నత కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నవారు చట్టాలకు భాష్యం చెప్పడంలో అనుసరించే పాక్షిక దృక్పథం, మరికొన్నిసార్లు ఒక మతంపై పక్షపాతంతో కూడిన ఆదేశాలు జారీ చేయడం అంతకన్నా ప్రమాదకరంగా మారుతున్నాయి. సంభల్‌ సివిల్‌ జడ్జి సర్వే చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన తరవాత అక్కడ నవంబర్‌ 24న కలహాలు చెలరేగాయి. ఈ కలహాల్లో అయిదుగురు మరణించారు. మొగల్‌ చక్రవర్తి బాబర్‌ 1529లో హరిహర దేవాలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించారని ఈ కేసులో అర్జీ పెట్టుకున్నవారు వాదిస్తున్నారు. ఇలాంటి వాదనలు చేసేవారు దేశంలో అనేక చోట్ల లెక్కలేనంత మంది ఉండొచ్చు. చరిత్రను తిరగ తోడడం మొదలు పెడితే ప్రతి ఆలయం, ప్రతి ప్రార్ధనా మందిరం వివాదాస్పదం కావచ్చు. బాబ్రీ మసీదు వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1991లో 1947 ఆగస్టు 15 కు ముందున్న మందిరాలు, ప్రార్థనా స్థలాల మీద ఎలాంటి వివాదాలు లేవనెత్తడానికి ఆస్కారం లేదని చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం నుంచి అయోధ్య-బాబ్రీ మసీద్‌ వ్యవహారాన్ని మాత్రం మినహాయించారు. ఎందుకంటే అప్పటికే అది న్యాయస్థానాల పరిశీలనలో ఉంది. అయోధ్య వివాదంపై 2019 నవంబర్‌ 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీర్పుచెప్పిన పీఠంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ సభ్యుడే. తీర్పు రాసింది కూడా ఆయనే. ఆ తీర్పు వల్ల ప్రశాంతత నెలకొని ఉండవచ్చు. చట్టపరంగా అది హాస్యాస్పదమైందని నల్సార్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా పనిచేసిన ఫైజన్‌ ముస్తఫా ఎప్పుడో వ్యాఖ్యానించారు. ప్రసిద్ధ న్యాయనిపుణుడే అంత మాటనడం చిన్న విషయం కాదు. అయోధ్యపై తీర్పులో వివాదాస్పదమైన 2.66 ఎకరాల భూమిని రామ మందిరం నిర్మించే వారికి ఇచ్చేయాలని, ముస్లింలకు ఆ పరిసరాల్లో ఎక్కడైనా అయిదెకరాల భూమి ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పు చట్టానికి అనుగుణమైంది అయితే కాదు. ఇది 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఆ వివాదాస్పద స్థలాన్ని మూడు ముక్కలు చేయాలని ఇచ్చిన తీర్పుకన్నా ఎంత మాత్రం మెరుగైంది కాదు. ప్రస్తుతం మతపరమైన రెండు అంశాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. ఒకటి ఉత్తర ప్రదేశ్‌లోని సంభల్‌పూర్‌లో ప్రస్తుతం ఉన్న మసీదు కింద హరిహర మందిరం ఉందనేది. రెండోది అజ్మీర్‌ దర్గా మొదట శివాలయమట. అజ్మీర్‌లో 800 ఏళ్లుగా ఉన్న మొయినుద్దీన్‌ చిష్తీ దర్గా కింద శివాలయం ఉందన్న వాదిస్తూ దాఖలైన పిటిషన్‌ను రాజస్థాన్‌లోని ఒక కోర్టు విచారణకు అంగీకరించింది. ఇవి రెండు విపరిణామాలకు దారి తీస్తాయి. మొదటిది ప్రతి ప్రార్థనా మందిరాన్ని, ఆలయాన్ని ప్రశ్నార్థకం చేసే కోర్టు పక్షులకు చేతినిండా పని కల్పిస్తుంది. రెండోది 1991లో ఆమోదించిన చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తుంది. శతాబ్దాల కింద నిర్మించిన ప్రతి మందిరం, మసీదుపై వివాదం రేపుతూ తవ్వకాలకు పాల్పడితే ఇక గతాన్ని తవ్వుకోవడంతోనే సరిపోతుంది. అజ్మీర్‌ దర్గాను 800 ఏళ్ల కింద అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాలిస్తున్న సమయంలో నిర్మించారు. ఇప్పుడు అది దర్గా కాదన్న వాదన లేవదీస్తున్నారు. అజ్మీర్‌ దర్గాను ఆ పరిసరాల్లోని వారే కాక దేశమంతటికీ చెందిన ముస్లింలే కాదు హిందువులు కూడా దర్శిస్తారు. భక్తిభావం వెలిబుచ్చుతారు. ప్రతి ప్రధానమంత్రి అజ్మీర్‌ దర్గాకు ‘‘చాదర్‌’’ (ఆ సమాధిపై కప్పే వస్త్రం) పంపుతూనే ఉన్నారు. గత పదేళ్ల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది చాదర్లు పంపారు. కానీ ఆయన పరివారం మాత్రం ప్రతి మసీదును తవ్వి చూడాలని కోర్టులకెక్కుతారు.
1991నాటి నాటి చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీర్పులు చెప్పడంలో, ఆ చట్టాన్ని విడమర్చడంలో కింది కోర్టుల జడ్జీల నుంచి ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన చంద్రచూడ్‌ దాకా చాలా సందర్భాలలో వక్రభాష్యాలే చెప్పారు. గ్యాన్‌ వాపి (జ్ఞాన వాపి) విషయంలో కూడా అదే జరిగింది. 1993 దాకా వివాదాస్పదమైన జ్ఞాన వాపిలో తాము ప్రార్థనలు చేశామని పిటిషన్‌ పెట్టుకున్న వారు వాదించారు. ఆ తరవాతే అక్కడ ఏడాదికొకసారి ప్రార్థించే అవకాశం ఇచ్చారు. పిటిషన్‌ పెట్టుకున్న వారు కేవలం జ్ఞాన వాపిలో ప్రార్థనలు చేయడానికి అవకాశం అడుగుతున్నారు కనక అది 1991 నాటి చట్టానికి విరుద్ధమైన కోరిక కాదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులోనే అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న చంద్రచూడ్‌ సర్వే చేయించడం 1991 నాటి చట్టాన్ని ఉల్లంఘించడం కాదన్నారు. ఆ చట్టం ప్రకారం ఏ ప్రార్థనా మందిర స్వభావాన్ని మార్చకూడదని ఉంది కాని సర్వే చేయించకూడదని లేదని చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. చివరకు సర్వేకు అనుమతించారు. ఈ తీర్పు ఆధారంగానే ఇప్పుడు సంభల్‌ మసీదు కింద హరిహర మందిరం ఉండేది కనక సర్వే చేయించాలని సంభల్‌ స్థానిక జడ్జీ ఆదేశించారు. జ్ఞాన వాపి కేసులో 1991నాటి చట్టాన్ని చంద్రచూడ్‌ సవ్యంగా విడమర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. జ్ఞానవాపి విషయంలో చంద్రచూడ్‌ ఇచ్చిన తీర్పు చివరకు పాముల బుట్టను తెరిచినట్టు అయింది. సర్వే చేయించడం ఉన్న పరిస్థితిని మార్చడం కాదని భాష్యం చెప్పడంతో ఇలాంటి వివాదాలను రేకెత్తించడంపై 1991 నాటి చట్టం విధించిన నిషేధం నీరుగారిపోయింది. జ్ఞానవాపి కేసులో చంద్రచూడ్‌ 1993 దాకా అక్కడ పూజలు చేసుకునే అవకాశం ఉండేది అన్న వాదనకు అనుకూలంగా సర్వేకు ఆదేశం జారీ చేశారు. ఇది 1991నాటి చట్టంలో వాడిన భాష అంతరార్థానికి, చట్టం అసలు ఉద్దేశానికే విరుద్ధం. చంద్రచూడ్‌ అనుసరించిన వైఖరినే కింది కోర్టులు కూడా అనుసరిస్తున్నట్టున్నాయి. ఈ వివాదాలు మసీదులకే పరిమితమై పోలేదు. బౌద్ధారామాలపై హిందూ దేవాలయాలు నిర్మించారన్న వాదనలూ ఉన్నాయి. రామేశ్వర్‌ ధాం, శబరిమల ఆలయాల మీద వివాదాలు అందరికీ తెలిసినవే. 2018లో ఐక్య మాల ఆర్య మహాసభకు చెందిన పి.కె.సజీవ్‌ ‘‘మా దేవాలయం మాకు ఇప్పించి న్యాయం చేయించండి’’ అని అడుగుతున్నారు. మరో వేపు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ కొన్ని ప్రార్థనా స్థలాల మీది అవి మనవి అన్న భావన ఉండుచ్చు. కానీ ప్రతిరోజూ ఓ కొత్త వివాదం లేవనెత్తడం అనవసరం అంటారు. కానీ అది సంఫ్‌ు పరివారానికి అర్థం కావలసిన రీతిలో అర్థం అవుతుంది. భాష్యకారులైన న్యాయమూర్తుల అండ వారికి ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు