Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘సుప్రీం’చెప్పి గంటలైనా గడవకముందే.. వంద మంది రైతులపై దేశద్రోహం కేసు

ఐదుగురి అరెస్టు ` ఎస్‌కేఎం ఖండన

హరియాణా డిప్యూటీ స్పీకర్‌ రణబీర్‌ గంగ్వా వాహనాన్ని సిర్సా జిల్లాలో రైతులు అడ్డుకున్న కేసులో వంద మందిపై దేశద్రోహంతోపాటు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో ఐదుగురిని సిర్సా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని సిర్సాలోని బాబా భూమన్‌ షాజి చౌక్‌ వద్ద కొందరు రైతులు ధర్నా చేశారు. అయితే ఘటన వీడియో ఫుటేజిని పరిశీలించిన తర్వాతే ఐదుగురికి అదుపులోకి తీసుకున్నామని, చిత్రాలను పెద్దవి చేసిచూసి వీరిని గుర్తించామని సిర్సా ఎస్పీ డాక్టర్‌ అర్పిత్‌ జైన్‌ వెల్లడిరచారు. ఈనెల 11న సిర్సాలో అధికార బీజేపీ-జేజేపీ కూటమి నేతలకు, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేశారు. అదే సమయంలో గంగ్వా వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లజేశారని, ప్రజాప్రతినిధి హత్యకు యత్నించారన్న ఆరోపణలతో అదే రోజు రైతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. ఇద్దరు రైతు నేతలు హర్‌చరణ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌తో పాటు వంద మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అయితే రైతు ఆందోళనకారులపై రాజద్రోహం కేసుల నమోదును సంయుక్త కిసాన్‌ మర్చా (ఎస్‌కేఎం) తీవ్రంగా ఖండిరచింది. రైతులపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమని, కల్పితమని ఒక ప్రకటనలో పేర్కొంది. సిర్సాలో హరియాణా డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు ఇద్దరు రైతు నేతలతో సహా దాదాపు వంద మంది అన్నదాతలపై రాజద్రోహం ఆరోపణలతో తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించింది. హరియాణాలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం సూచనలతోనే ఈ కేసులు నమోదు చేశారని పేర్కొంది. ఈ తరహా చర్యలతో రైతులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వాహనం అద్దం పగిలితే దేశద్రోహం, హత్య కేసులు ఎలా పెడతారని ఎస్‌కేఎం సీనియర్‌ నాయకుడు దర్శన్‌ పాల్‌ ప్రశ్నించారు. రైతులు ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేయడం దేశద్రోహమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, జేజేపీ, కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చే స్వతంత్రులతో సహా శాసన సభ్యులను శాంతియు తంగా బహిష్కరిస్తామని, గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని ఇప్పటికే ప్రకటించామని దర్శన్‌ పాల్‌ అన్నారు. కాగా, రాజద్రో హం చట్టంలోని సెక్షన్‌ 124 ఎపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే రైతులపై కేసు వెలుగులోకి రావడం గమనార్హం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా బ్రిటిష్‌ కాలం నాటి వలసచట్టం అవసరం ఏమిటని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ చట్టం వల్ల ప్రయోజనం కంటే దుర్వినియోగమే ఎక్కువని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img