Homeఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌, బీజేడీ దూరం

ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌, బీజేడీ దూరం

- Advertisement -

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
ఎన్డీయే, ‘ఇండియా’ తుది కసరత్తు

న్యూదిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బిజూ జనతాదళ్‌(బీజేడీ) ప్రకటించాయి. బీఆర్‌ఎస్‌కు నలుగురు, బీజేడీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఈ 11 మంది ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయడం లేదు. ఇండియా ఐక్యసంఘటన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఆమ్‌ఆద్మీ (10 మంది ఎంపీలు) ప్రకటించినప్పటికీ… ఎంపీ స్వాతి మాలివాల్‌కు ఆ పార్టీతో సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. శిరోమణి అకాలీదళ్‌, జోరమ్‌ పీపుల్స్‌ మూమెంట్‌ (మిజోరం) వంటి పార్టీలకు ఒక్కొక్క ఎంపీ ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంటు భవనంలోని వసుధలో ఎఫ్‌-101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. ఈ ఎన్నికకు పార్లమెంటు ఉభయసభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. అధికార ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ (67), ఇండియా ఐక్యసంఘటన నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి (79) పోటీచేస్తున్న సంగతి విదితమే. మరోవైపు ఎన్నిక ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్‌డీఏ, ఇండియా ఐక్యసంఘటన తమ ఎంపీలతో వేర్వేరు సమావేశాలు నిర్వహించాయి. తమ తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన రెండ్రోజుల వర్క్‌షాప్‌ ఆదివారం దిల్లీలో మొదలైంది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. సోమవారం బీజేపీ అగ్రనేతలు ఎన్డీఏ ఎంపీలతో భేటీ అయ్యి పోలింగ్‌కు సంబంధించిన వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. సంవిధాన్‌ సదన్‌లోని సెంట్రల్‌ హాల్‌లో తమ ఎంపీలతో భేటీ నిర్వహించి ఈ ఎన్నికలో ఓటు వేయాల్సిన పద్ధతిని, పాటించాల్సిన విధివిధానాలను సభ్యులకు ఇండియా కూటమి వివరించింది. సమావేశం అనంతరం వారికి మాక్‌ పోల్‌ నిర్వహించారు. తమ కూటమి బలంగా ఉందని, విపక్షం ఐక్యంగా ఉందని ప్రతిపక్ష ఎంపీలు అన్నారు. మెజార్టీ మార్జిన్‌ తక్కువగా ఉందని, అందువల్ల తమ అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పుడు ఓటింగ్‌ జరిగే అవకాశం లేకుండా మాక్‌ పోలింగ్‌ నిర్వహించినట్లు చెప్పారు. అన్ని పార్టీల ఎంపీలూ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్‌రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చేశారు. తాను ఏ పార్టీ తరపునా పోటీ చేయడం లేదని, రాజకీయాలకతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు తమ ఎంపీలను సమాయత్తపరిచేందుకు ఏపీ నుంచి మంత్రి నారా లోకేశ్‌, తెలంగాణ నుంచి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్‌ విధానం అనుసరిస్తారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్‌ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికీ తమ పార్టీకే ప్రాధాన్యం ఇస్తారు. క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశమూ ఉంటుంది. ఇక ఈ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓటింగ్‌ ఏజెంట్లను నియమిం చింది. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో పాటు మరో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఎన్డీయే వర్సెస్‌ ‘ఇండియా’
లోక్‌సభ 542, రాజ్యసభలో 239 సభ్యులు కలిసి మొత్తం ఎలక్టోర్‌ల సంఖ్య 781 కాగా ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్కు 391. అధికార ఎన్డీయే కూటమికి ఇప్పటివరకు 422 సభ్యుల బలముంది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (11 మంది సభ్యులు) ఎన్డీయేకు మద్దతు ఇస్తుండడంతో మెజార్టీ పెరగనుంది. మరిన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. కాగా ఇండియా ఐక్యసంఘటనకు 311 మంది బలముంది. ఇతరులు 45 మంది ఉన్నారు. వీరితో సహా కొన్ని పార్టీలు మద్దతిచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తున్నారు. దీంతో పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని ‘ఇండియా’ అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఇప్పటికే ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు