
విశాలాంధ్ర — దేవరపల్లి : యూరియా కొరత లేదని, రైతులు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని దేవరపల్లి మండలంలో గల ఏడు సొసైటీల అధ్యక్షులు పేర్కొన్నారు. దేవరపల్లి సొసైటీలో సోమవారం సాయంత్రం మండలంలోని దేవరపల్లి, గౌరీపట్నం, దుద్దుకూరు, ఎర్నగూడెం, చిన్నాయగూడెం , కురుకూరు, త్యాజంపూడి సొసైటీ అధ్యక్షులు ఉప్పులూరి రామారావు, ఆండ్రు అనిల్, కరటూరి శ్రీరామమూర్తి, పెనుమత్స సుబ్బరాజు, యలమాటి భాస్కరరావు, కోడూరి వెంకటరత్నం, గన్నమని గోపాలకృష్ణ లు మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవరపల్లి మండలంలో గత సంవత్సరం 7500 ఎకరాలలో వరి పంట వేయగా ఈ సంవత్సరం సార్వాలో 9 వేలఎకరాలకు పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా 30% యూరియా వాడకం జరిగిందని, గత వైసిపి ప్రభుత్వం లో ఆఖరు మూడు సంవత్సరాలు 1750 టన్నులు యూరియా వాడగా ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వంలో ఒక సంవత్సరంలోనే 1600 టన్నులు యూరియా వాడటం జరిగిందని తెలిపారు. యూరియా కొరత లేదని దేవరపల్లి మండలంలో దేవరపల్లి, ఎర్నగూడెం, చిన్నాయగూడెం, త్యాజంపూడి, గౌరీపట్నం, కురుకూరు, దుద్దుకూరు సొసైటీలలో 75 టన్నులు ఉన్నాయి తెలిపారు. అత్యవస పరిస్థితిలో రైతులకు యూరియా అందించేందుకు దేవరపల్లి డిసిఎంఎస్ బ్రాంచిలో 21 టన్నులు యూరియా సిద్ధంగా ఉందని సొసైటీ అధ్యక్షులు తెలిపారు. రైతులు ఎటువంటి అపోహలు పడవద్దని తెలిపారు. ఈ సంవత్సరం దాన్యం సేకరణలో 24 గంటల్లో కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలో సొమ్ము చెల్లించడం జరిగిందని తెలిపారు. రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర లభించడంతో ఇతర చిరుధాన్యాలపై మొక్కువ చూపకుండా రైతులందరూ వరి పంట వేస్తున్నారని తెలిపారు. సొసైటీ అధ్యక్షులు దేవరపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్నమని హరికృష్ణ దేవరపల్లి డిసిఎంఎస్ బ్రాంచ్ సందర్శించి ఎరువులను పరిశీలించారు. డీసీఎంఎస్ డిపో మేనేజర్ రమేష్ వివరాలు తెలిపారు.


