విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని జైభీమ్ ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి మంచోది దుబ్బన్న, అధ్యక్షులు ఆదాము, ఇంచార్జీ మంచోది రవి కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో జైభీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహామేదావి ప్రపంచ జ్ఞాని న్యాయ కోవిదుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు, అవమానాలను, అంటరానితనాలను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివారన్నారు. నాలాంటి అవమానం తన జాతి బిడ్డలకు జరగకూడదని పోరాటం చేశారని గుర్తు చేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి బాటలు వేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహానుభావుని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడలలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైభీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు యేసు, కిరీటి, పవన్, పేతురు, చిన్న, రవి తదితరులు పాల్గొన్నారు.