సిరియాలో ఉన్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని వీడి రావాలని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి సూచన చేసేవరకు సిరియాకు ఎవరూ ప్రయాణించవద్దని అప్రమత్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం పొద్దుపోయాక భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అడ్వైజరీ విడుదల చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని కూడా షేర్ చేసింది. డమాస్కస్‌లోని ఇండియన్ ఎంబసీ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలని అక్కడి భారతీయులకు సూచించింది. కమర్షియల్ విమానాలు అందుబాటులో ఉండి సిరియా నుంచి వచ్చేయగలిగేవారు వీలైనంత త్వరగా బయలుదేరండి. తక్షణమే బయలుదేరలేనివాళ్లు అత్యంత అప్రమత్తంగా ఉండండి. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. వీలైనంత వరకు బయటకు వెళ్లకండి. డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 963 993385973 సంప్రదించండి. ఈ నంబర్‌కు వాట్సాప్ సదుపాయం కూడా ఉంది. అత్యవసర ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఎంబసీ సిబ్బందిని కూడా సంప్రదించి ఎప్పటికప్పుడు సలహాలు అడగవచ్చు అని అడ్వైజరీలో విదేశాంగ శాఖ పేర్కొంది.
కాగా సిరియాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. రష్యా, ఇరాన్ మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారు. టర్కీ మద్దతు ఉన్న ఈ తిరుగుబాటు దళాలు గత వారం రోజులుగా సిరియాలో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ను పడగొట్టడమే లక్ష్యమని ప్రకటించాయి. దీంతో సిరియాలో తీవ్రమైన కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.