Homeరక్తమోడిన రహదారి

రక్తమోడిన రహదారి

- Advertisement -

ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం

. రంగారెడ్డి జిల్లా మీర్జాగుడా వద్ద ఘటన
. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ
. మృతుల్లో తల్లీకూతురు, ముగ్గురు అక్కచెల్లెళ్లు

విశాలాంధ్ర-హైదరాబాద్‌/మొయినాబాద్‌:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందగా… పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి సహా 20 మంది ఉన్నారు. ప్రమాద వార్త తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. టీఎస్‌ 34 టీఏ 6354 నంబరు గల ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4.40 గంటలకు బస్సు బయల్దేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే ఉద్యోగులు ఎక్కారు. మొత్తం బస్సులో సుమారు 72 మంది ప్రయాణికులు ఉన్నారు. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. చేవెళ్ల-వికారాబాద్‌ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సహాయక చర్యల సమయంలో, చేవెళ్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌ శ్రీధర్‌ పై ఒక జేసీబీ ఎక్కి ఎడమ కాలుకు గాయమైంది. సీఐని చికిత్స కోసం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. అసలేమైందంటే… తాండూరు నుండి బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాగుడా వద్దకు చేరుకోగానే ఎదురుగా కంకర లోడ్‌ తో వస్తున్న టిప్పర్‌ ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా… డ్రైవర్‌ వైపు ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జయింది. దీంతో లారీలో ఉన్న కంకర మొత్తం ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికుల పై పడిపోయింది. ప్రయాణికులు కంకర కింద కూరుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రయాణికుల ఆర్తనాదాలతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఈ ఘటన బీజాపూర్‌ జాతీయ రహదారి పై జరగడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అంబులెన్స్‌ లు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అతివేగంగా కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బస్సు లోపలికి టిప్పర్‌ దూసుకెళ్లింది. టిప్పర్‌లో ఉన్న కంకర బస్సులో పడటంతో ముందు వరుసలో ఉన్న ఆరు సీట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద జరిగిన స్థలంలోనే 18 మంది మృతి చెందారు.
బాధాకరమైన ఘటన: కేసీఆర్‌, కేటీఆర్‌
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్‌ స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 20 మంది మృతి చెందిన ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం చాలా బాధాకరం అని తెలిపారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రమాద స్థలి వద్ద ఉద్రిక్తత…
ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రమాద స్థలం వద్దకు చేవెళ్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేరుకున్నారు. అయితే అక్కడ ఆయనకు ప్రయాణికుల నుండి నిరసన సెగ ఎదురైంది. ఎమ్మెల్యే పైకి స్థానిక ప్రజలు రాళ్లు ఎత్తుకుని, ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటు నినాదాలు చేశారు. ముఖ్యంగా రోడ్డు నిర్మాణ పనుల జాప్యం కారణంగానే నేడు ఈ పరిస్థితి ఏర్పడిరదని మండిపడ్డారు. దీనికి ఎమ్మెల్యేనే కారణమని విమర్శించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో స్థానికుల వాగ్వాదానికి దిగారు. బస్సును ఇక్కడ నుండి తొలగించవద్దని అని పట్టుబట్టారు. దీంతో ప్రమాద స్థలం నుండి ఎమ్మెల్యే యాదయ్య వెళ్లిపోవాల్సి వచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు