. వివాదం నుంచి విజయం వరకు
. కిరీటం దక్కించుకున్న ఫాతిమా బాష్
బ్యాంకాక్: విశ్వ సుందరి`2025గా మెక్సికో భామ కిరీటం దక్కించుకున్నారు. మిస్ యూనివర్స్ టైటిల్‌ను ఫాతిమా బాష్ గెలుచుకున్నారు. థాయిలాండ్‌లోని నంతాబురి ప్రావిన్స్‌లో అందాల పోటీల చివరి అంకం వైభవంగా సాగింది. ఫాతిమాకు కిరీటాన్ని మాజీ మిస్ యూనివర్స్ డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ అందజేశారు. 120 మందికి పైగా భామలు ఈ పోటీల్లో పాల్గొనగా.. 25 ఏళ్ల ఫాతిమా విజేతగా నిలిచారు. ఫస్ట్ రన్నరప్‌గా థాయిలాండ్ సుందరి ప్రవీనర్ సింగ్ (29), సెకెండ్ రన్నరప్‌గా వెనిజులా భామ స్టెఫనీ ఆడ్రియానా అబాసలీ నసీర్ (25) నిలిచారు. మిస్ మెక్సికో ఫాతిమా బాష్ పోటీల ఆరంభంలోనే వివాదంలో చిక్కుకున్నారు. నిర్వాహకులు అవమానించినా ధైర్యంగా సమాధానం చెప్పారు. ఇదే క్రమంలో ఒక కార్యక్రమంలో నిరసన వ్యక్తంచేస్తూ అక్కడ నుంచి వాకౌట్ చేశారు. ఆమెకు మరికొందరు భామలు మద్దతిచ్చారు. ఫాతిమాకు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా మద్దతిచ్చారు. ఇదిలావుంటే, మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్ డిజైనింగ్ చదివారు. డిస్లెక్సియా, హైపర్యాక్టివిటీ డిజార్డర్‌తో బాధ పడిన ఆమె… వాటన్నింటిని అధిగమిస్తూ మిస్ యూనివర్స్ స్థాయికి ఎదిగారు. సెప్టెంబరులో మిస్ యూనివర్స్ మెక్సికో 2025 టైటిల్ గెలుచుకున్నారు. ఇదిలావుంటే, మిస్ యూనివర్స్`2025 పోటీల్లో భారత్ నుంచి మణికా విశ్వకర్మ పాల్గొన్నారు. రాజస్థాన్‌కు చెందిన ఆమె స్విమ్‌సూట్ రౌండ్‌తో టాప్ 30 వరకు వెళ్లారు కానీ టాప్ 12లో నిలవలేకపోయారు. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వున్నారు. విశ్వ సుందరి టైటిల్ గెలుచుకున్న భామకు 2,50,000 డాలర్ల నగదు పురస్కారం లభిస్తుందని తెలుస్తోంది. ప్రతినెల 50వేల డాలర్ల వేతనం అందుతుంది. మిస్ యూనివర్స్ కిరీటం ధర 5 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.44కోట్లు) పైనే ఉంటుంది. న్యూయార్క్ నగరంలో మిస్ యూనివర్స్ అపార్ట్‌మెంట్స్‌లో ఏడాది పాటు ఉచితంగా నివసించే అవకాశం విజేతకు లభిస్తుంది. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, సహాయకుల బృందాన్ని ఉచితంగా సేవలందిస్తారు.


