Homeనిర్మాణానికే పీపీపీ

నిర్మాణానికే పీపీపీ

- Advertisement -

. నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే
. 70 శాతం పడకలు, వైద్యసేవలు ఉచితం
. వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకూ ఆధునిక వైద్యం
. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు వివరణ
. ఏప్రిల్‌1 నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ అమలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మెడికల్‌ కాలేజీలను పబ్లిక్‌ ప్రైవేట్‌ పాట్నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో చేపడుతున్నప్పటికీ అది నిర్మాణం వరకేనని, పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వమే చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడిరచారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్‌ హెల్త్‌ స్కీంపై అధికారులతో చర్చించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రక్రియపై ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియలో నాలుగు దశలు దాటామని, వచ్చే నెలాఖరుకు టెండర్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడిరచారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్‌ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించాం. వాటిలో 25 ఎకరాల్లో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలి. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్‌, పారామెడికల్‌, డెంటల్‌ లాంటి ఆయుర్వేద, వెల్‌ నెస్‌ సెంటర్‌, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్‌ చేయాలి. ఆస్పత్రుల్లో 70 శాతం మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయించడంతో పాటు, వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలి. బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ చేస్తున్న ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలి. నీతి ఆయోగ్‌ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.
దేశానికే దిక్సూచి సంజీవని ప్రాజెక్టు
కుప్పంలో పైలట్‌ గా అమలు చేస్తున్న డిజినెర్వ్‌ సెంటర్‌ సంజీవని ప్రాజెక్టు వైద్యారోగ్య రంగంలో దేశం మొత్తానికి దిక్సూచిగా నిలిచే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు. డిజిటల్‌ హెల్త్‌ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని, ప్రస్తుతం కుప్పంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేస్తున్న సంజీవని ద్వారా 3.38 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించాలని సూచించగా, కుప్పంలో రిజిస్టర్‌ అయిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్స్‌ ను సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2026 జనవరి`1నుంచి చిత్తూరు జిల్లా మొత్తానికి ఈ సంజీవని ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రం మొత్తం ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
2026 ఏప్రిల్‌ నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అమలు
రాష్ట్రప్రభుత్వం అమలు చేయనున్న యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్సు విధానాన్ని 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 12 లక్షల క్లెయిమ్‌లు ఆస్పత్రుల నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టుకు వస్తున్నాయని తద్వారా ఒక నెలకు రూ.330 కోట్ల వ్యయం చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ వ్యాధికి ఎంత వ్యయం చేస్తున్నామో విశ్లేషించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. సమీక్ష లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సౌరబ్‌ గౌర్‌, వీరపాండియన్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంస్‌ఎంఈ పార్కుల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆ శాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు ఆన్‌ లైన్‌ ద్వారా పాల్గొన్నారు, వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకూ అలాగే డిసెంబరు 3 తేదీన నిర్వహించనున్న రైతన్నా – మీ కోసం కార్యక్రమంలో తానూ పాల్గొంటానని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి రైతులు నష్టపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు