Homeధర్మేంద్ర కన్నుమూత

ధర్మేంద్ర కన్నుమూత

- Advertisement -

ముంబై: గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల కొద్ది రోజులు ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ వార్తలొచ్చాయి. అయితే ధర్మేంద్ర కోలుకుంటున్నారని కుటుంభసభ్యులు ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి ఇంటివద్దనే ఉంచి వైద్యం అందిస్తున్న క్రమంలో సోమవారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆరు దశాబ్దాలుగా తన అత్యుత్తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిం చుకున్న ధర్మేంద్ర…300కు పైగా చిత్రాల్లో నటించారు. యాక్షన్‌ కింగ్‌గా, బాలీవుడ్‌ హీ-మ్యాన్‌గా గుర్తింపు పొందారు. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటులలో ధర్మేంద్ర ఒకరు. ఆరు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో అనేక బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వచ్చాయి. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు కాగా, ఒకరు ప్రకాశ్‌ కౌర్‌, మరొకరు హేమమాలిని. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆయన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో షోలే, ధరమ్‌ వీర్‌, సీతా ఔర్‌ గీతా, చుప్కే చుప్కే, గజబ్‌, దో దిశాయే, ఆంఖే, షికార్‌, ఆయా సావన్‌ రaూమ్‌ కే, జీవన్‌ మృత్యు, మేరా గావ్‌ మేరా దేశ్‌, యాదోం కీ బారాత్‌ సహా మరెన్నో ఉన్నాయి. 1935 డిసెంబర్‌ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్‌ సింగ్‌ డియోల్‌. సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌, ఇషా డియోల్‌ ఆయన సంతానమే. 1960లో ‘దిల్‌ బీ తేరా హమ్‌ బీ తేరా’తో ధర్మేంద్ర నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆయన చివరి చిత్రం ‘ఇక్కీస్‌’ త్వరలో విడుదల కానుంది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ధర్మేంద్ర రాజకీయాల్లోనూ రాణించారు. 2004లో బికనీర్‌ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు.
రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం
ధర్మేంద్ర మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని, ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు ధర్మేంద్ర మరణం భారతీయ సినిమాకు తీరని లోటని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలియజేశారు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణంతో భారతీయ సినీ రంగంలో ఒక శకం ముగిసింది. తన నటనతో ఎన్నో పాత్రలకు వన్నె తెచ్చారు. ఎంతో మంది ప్రేక్షకులను హృదయాల్లో నిలిచిపోయాని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన్నారు. ఇంకా కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్‌.చంద్రబాబునాయుడు, ఎ.రేవంత్‌రెడ్డి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, దేశవ్యాప్తంగా అనేకమంది సినీ ప్రముఖులు ధర్మేంద్ర మృతిపట్ల సంతాపం తెలిపారు.
ముంబైలో అంత్యక్రియలు
మంబైలోని విలే పార్లే శ్మశాన వాటికలో ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించారు. బాలీవుడ్‌ ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, బీ టౌన్‌ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సహా అనేకమంది బాలీవుడ్‌ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. తొలుత ధర్మేంద్ర భౌతిక దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు. ధర్మేంద్ర కన్నుమూశారన్న సమాచారం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు శ్మశాన వాటికకే తరలివచ్చి, నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు