సిపిఐ వందేళ్ళ వేడుకలు అన్ని శాఖల్లో సిపిఐ శ్రేణులు ఘనంగా నిర్వహించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ
విశాలాంధ్ర విజయనగరం టౌన్ : రాజ్యసభ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను వెంటనే బర్త్ రఫ్ చేసి, జాతికి బేషరతుగా మోడీ, అమిత్షాలు క్షమాపణ చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్.
శుక్రవారం డి. ఎన్. ఆర్ అమర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒమ్మి రమణ మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టి, సంపదను అంబానీ ఆదానిలకు దోచిపెడుతూ ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో, దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో తినే తిండి పైన, కట్టుకునే బట్టపై ఆంక్షలు విదేస్తూ ప్రజల మధ్య వైశ్యామ్యాలు రెచ్చగొట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నదన్నారు. స్వతంత్ర సంస్థలైన సిబిఐ , ఈడి, ఎన్నికల కమిషన్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చలాయిస్తూ ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. నిన్నటి వరకు రాజ్యాంగం కంటే సనాతన ధర్మమే గొప్పది అనే దుష్ప్రచారానికి సంఘ పరివార్ ను మోడీ ప్రభుత్వం ఉసిగొల్పుతోందన్నారు. ఒకవైపు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ అధికారాన్ని చలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ భారత జాతి ముద్దుబిడ్డ, బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను తలుచుకుంటే ఏమొస్తుంది అంటూ అవాకులు చెవాకులు పేల్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాటల వెనుక ఆర్ఎస్ఎస్ మనువాద ఎజెండా దాగి ఉన్నదన్నారు. మనసు నిండా మనువాదాన్ని నింపుకొని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించే బిజెపి నేతలకు రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. దేవుడు దైవం కలవారల సృష్టినని మనుషులంతా ఒకటేనని మను ధర్మ శాస్త్రాన్ని మంటల్లో తగలబెట్టి బుద్ధిజాన్ని స్వీకరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలను అమిత్ షా లాంటి ఆర్థిక నేరగాళ్లు ఆపలేరన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆదాని గ్రూపు కంపెనీల అవినీతి తప్పిదాల అశ్రిత పక్షపాత ధోరణిని, అవినీతి తప్పిదాలు క్రోనీ కాపీట లిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ హామీలు అమలు చేయాలని, ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని డిమాండ్ల సాధన కోసం సిపిఐ నిర్వహించే పోరాటాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు.
భారతగడ్డ పై భారత కమ్యునిస్టు పార్టీ (సిపిఐ) డిసెంబర్ 26 నాటికి వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న తరుణంలో జిల్లా వ్యాపితంగా అన్ని శాఖల్లో సిపిఐ జెండాలు ఎగుర వేసి సభలు, ర్యాలీలు నిర్వహించి ఘనంగా నిర్వహించాలనీ పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు ఉన్నారు.