కమ్యూనిజం వందేళ్ళ పోరాటాల త్యాగాలు ప్రత్యేక సంచికను విడుదల చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, శత వార్షికోత్సవాల సందర్భంగా కమ్యూనిజం వందేళ్ళ పోరాటాల త్యాగాలు ప్రత్యేక సంచికను సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ విడుదల చేశారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో సింగనమల నియోజకవర్గం,బుక్కరాయసముద్రం మండల కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి చిన్న తిరుపతయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి జాఫర్ మాట్లాడుతూ… డిసెంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అందులో భాగంగా కార్యచరణ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26, 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం రావాలని పిలుపునిచ్చినటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. దేశవ్యాప్తంగా కష్టజీవులు, శ్రమజీవులు తరపున నిలబడినటువంటి పార్టీ అని తెలిపారు. 26వ తేదీన అన్ని శాఖల వారీగా ప్రతి నియోజకవర్గ, మండల స్థాయిలో సిపిఐ జెండా పతావిష్కరణ చేసి ర్యాలీ, సభలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 31వ తేదీన అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు గత ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వలేకపోయారని గత ఎన్నికల్లో టిడిపి పార్టీ పట్టణాల్లో రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణానికి గాను ఐదు లక్షల ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కరెంటు చార్జీలు 15 వేల 484 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేస్తోందన్నారు. ట్రూ అప్ చార్జీల పేరుతో 6 వేల 72 కోట్లు , సర్ చార్జీల పేరుతో 9 వేల 412 కోట్లు ప్రజలపై పన్ను భారం మోపుతున్నారు అన్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని ఉపసంహరించుకునేంతవరకు కమ్యూనిస్టు పార్టీ జనవరి మాసంలో ఉదృతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రజలపై భారం పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు నిరసన కార్యక్రమాలలో మేధావులు, కార్మిక, రైతులు, వ్యాపార వాణిజ్య వ్యాపారస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సింగనమల్ల మండల నియోజకవర్గం కార్యదర్శి టి. నారాయణస్వామి, బుక్కరాయసముద్రం, మండల సిపిఐ కార్యదర్శి, ఎర్రి స్వామి, శాఖా కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.