Homeఅంతర్జాతీయం10 శాతం సుంకాలుతక్షణమే అమలులోకి: ట్రంప్

10 శాతం సుంకాలుతక్షణమే అమలులోకి: ట్రంప్

- Advertisement -

వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దాన్ని అత్యంత సిగ్గుచేటైన, తప్ప్పుడు తీర్పుగా ట్రంప్ అభివర్ణించారు. ఆ తీర్పు ఇచ్చిన జడ్జిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వాళ్లు పనికిమాలిన వాళ్లు. దేశానికే తలవంపులు తెచ్చారు. దేశానికి ఏది మేలో అర్థం చేసుకుని ఆ దిశగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఏ మాత్రమూ లేని ఆ జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నా’ అని తూర్పారబట్టారు. శుక్రవారం తీర్పు వెలువడ్డ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆ తీర్పుపై విదేశీ ప్రయోజనాల ప్రభావముందని తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో దేశాలన్నీ సంబరపడుతున్నాయని వాపోయా­రు. ప్రపంచ దేశాలపై 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ‘ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులపై త్వరలో సంతకం చేస్తా’ అని ట్రంప్ చెప్పారు. తన వాణిజ్య అజెండాకు కోర్టు తీర్పు విఘాతం కలిగించబోదని చెప్ప్పుకొచ్చారు. ఇదే సమయంలో ‘దేశ ఆదాయాన్ని పెంచేందుకు మరింత శక్తిమంతమైన మార్గాలెన్నో మాకు అందుబాటులో ఉన్నాయి. ఇకపై మరిన్ని టారిఫ్‌లు విధించగలను’ అని బెదిరింపులకు దిగారు. 1977 నాటి ఐఈఈపీఏ చట్టం ప్రకారం ట్రంప్ ఇప్పటిదాకా పలు దేశాలపై విధించిన టారిఫ్‌లు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రద్దయినందున, వాటి స్థానంలో ఆయన తాజాగా ప్రకటించిన 10 శాతం టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. 1974 నాటి వర్తక చట్టంలోని 122వ సెక్షన్ ప్రకారం ట్రంప్ వాటిని విధించారు. ఈ నిర్ణయం 150 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. లేదంటే ఆ టారిఫ్‌లు అంతటితో రద్దవుతాయి. ఇదే సమయంలో వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరింత రెచ్చిపోతూ అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే భారత్ కూడా ఆ 10 శాతం సుంకాలు చెల్లించాల్సిందే అని వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విలేకర్ల సమావేశంలో వైట్‌హౌస్ అధికారులు ఈ విషయం చెప్పారు. మరో చట్టపరమైన అధికారం అమల్లోకి వచ్చే వరకు 10 శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్ అనేది ట్రంప్ చేపట్టిన రక్షణాత్మక వాణిజ్య విధానంలో భాగమని పేర్కొన్నారు. చెల్లింపుల సమతుల్యత లోటు తగ్గించడం, అన్యాయ వాణిజ్య విధానాలను పరిష్కరించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
చట్టవిరుద్ధమైన తీర్పు: జేడీ వాన్స్
సుప్రీంకోర్టు తీర్పుపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ‘దేశ దిగుమతులను నియంత్రించే సామర్థ్యాన్ని అధ్యక్షుడికి కాంగ్రెస్ కట్టబెట్టినప్పటికీ… సుప్రీం తీర్పుతో అది జరగకుండా పోతోంది. ఇది చట్టవిరుద్ధమైన తీర్పు. దీనివల్ల అమెరికా పరిశ్రమలు, సరఫరా గొలుసును అధ్యక్షుడు పరిరక్షించే అవకాశం కష్టతరంగా మారనుంది. అమెరికా కార్మికుల భద్రత, వాణిజ్య ప్రాధాన్యాలను ముందుకుతీసుకెళ్లడం కోసం అధ్యక్షుడికి విస్తృత అధికారాలున్నాయి’ అని వాన్స్ తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు