న్యూదిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ‘కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ (సీసీఎస్) ఉన్నతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇది రెండో సీసీఎస్ సమావేశం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌పై ప్రభావం గురించి సమావేశంలో చర్చించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జె.పి. నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పూరి ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శులు పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 22న తొలి సీసీఎస్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, చమురు, ఇంధన భద్రతపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


