అంతర్జాతీయ అనిశ్చితులు, డాలర్ బలపడటమే ప్రధాన కారణం
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శనివారం కూడా నేలచూపులు చూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం వంటి అంశాలు దేశంలో పసిడి, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా, ఈ విలువైన లోహాల ధరలు మరోసారి భారీగా తగ్గాయి.గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం ఇవాళ ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.980 తగ్గి రూ.1,56,930కి పడిపోయింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.900 తగ్గి రూ.1,43,850 వద్ద స్థిరపడింది.
బంగారం బాటలోనే వెండి ధర కూడా పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై ఏకంగా రూ.15,000 మేర పతనం నమోదైంది. ఈ భారీ తగ్గుదలతో కిలో వెండి ధర రూ.2.9 లక్షలకు దిగివచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లోని మార్పులే దేశీయంగా ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


