రేపు ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్
రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.
ప్రముఖ హరిత విద్యుత్ సంస్థ ఎస్ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో తన అనుబంధ సంస్థల ద్వారా రూ.2,400కోట్ల పెట్టుబడితో రెండు ప్రాంతాల్లో 600మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులను శుక్రవారం కొండాపురం మండలం టి.కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఏడాది 87.6కోట్ల యూనిట్ల స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి కానుంది. కొండాపురం మండలం టి.కోడూరు గ్రామంతో పాటు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొడాయిపల్లి పరిసరాల్లో రూ.1,200కోట్ల వ్యయంతో 300మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు.
500 మందికి ఉపాధి అవకాశాలు
అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం దిగువ కలువట్ల ప్రాంతం, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె సమీపంలో మరో రూ.1,200 కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ రెండు విద్యుత్ కేంద్రాల వల్ల సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం-2024ః నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ప్రాజెక్టుల కోసం రెండు ప్రాంతాల్లో కలిపి 1,542 ఎకరాల భూమిని రైతుల నుంచి 30ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు. ఇందుకు ఎకరానికి సంవత్సరానికి రూ.31 వేల చొప్పున చెల్లిస్తూ, ప్రతి రెండేళ్లకోసారి 5శాతం పెంపు ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రైతులకు దీర్ఘకాలిక స్థిర ఆదాయం లభించనుంది.
సౌర విద్యుత్ కేంద్రాల్లో అత్యాధునిక ద్విముఖ సౌర సాంకేతికత
పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయి.
వచ్చే 25 ఏళ్లలో దాదాపు 2.16 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం ఈ కేంద్రాలకు ఉందని సంస్థ వెల్లడించింది. ఈ సౌర విద్యుత్ కేంద్రాల్లో అత్యాధునిక ద్విముఖ సౌర సాంకేతికతను వినియోగించారు. సాధారణ సౌర ఫలకాలు పైభాగంలో పడే సూర్యకాంతినే ఉపయోగించుకుంటే, ద్విముఖ ఫలకాలు నేలపై నుంచి తిరిగి వచ్చే కాంతిని కూడా గ్రహించి రెండు వైపుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల తక్కువ స్థలంలోనే అధిక విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతోంది.
ఇక్కడ తయారయ్యే విద్యుత్‌ను జాతీయ విద్యుత్ వ్యవస్థకు అనుసంధానించేందుకు ప్రాజెక్టు ప్రాంగణంలోనే 220/33 కేవీ సామర్థ్యంతో విద్యుత్ సమీకరణ కేంద్రాన్ని నిర్మించారు.
అక్కడి నుంచి 12.8 కిలోమీటర్ల పొడవైన అధిక విద్యుత్ ప్రసార మార్గం ద్వారా పవర్ గ్రిడ్ సంస్థకు చెందిన కర్నూలు-3 కేంద్రంతో అనుసంధానం చేశారు. సౌర విద్యుత్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే 25 ఏళ్లపాటు ఈ కేంద్రాల నుంచి స్వచ్ఛ విద్యుత్ సరఫరా కొనసాగనుంది.


