తెలంగాణలో ప్రస్తుతం పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం మొద్దునిద్ర పోతారని ప్రశ్నిస్తూ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్నదాతల సమస్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కొండంత ధైర్యంతో బతికిన సాగు రంగాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం కొద్ది నెలల్లోనే కన్నీటి సేద్యంగా మార్చేసిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే వారాల తరబడి పడిగాపులు కాస్తూ, గుండెపగిలి కుప్పకూలుతున్నా ప్రభుత్వానికి కనీస సోయి లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి తన కుర్చీని కాపాడుకోవడానికి 70 సార్లు ఢిల్లీ చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధలో ఒక్క శాతం కూడా రైతులపై పెట్టడం లేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ తీవ్రతకు, వడదెబ్బకు తోడు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం వల్ల దాదాపు 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని లేఖలో పేర్కొన్నారు. వరంగల్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడ చూసినా రోజుకు కనీసం ఒక్క లారీ లోడ్ కూడా ఎత్తడం లేదని, అడపాదడపా కొనే చోట కూడా క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తూ రైతుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి గన్నీ బ్యాగుల కోసం రైతుల నుంచే రూ. 50 డిపాజిట్ వసూలు చేసే దుస్థితి తేవడం సిగ్గుచేటన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మూడు నెలల ముందే ప్రణాళికలు వేసి, కరోనా కష్టకాలంలోనూ రైతుల కల్లాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా భరోసా ఇచ్చారని కేటీఆర్ నీపేర్కొన్నారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి కనీసం టార్పాలిన్లు కూడా సమకూర్చలేకపోతోందని, దీనివల్ల రైతులు కళ్లముందే ధాన్యం కొట్టుకుపోతుంటే నిస్సాహాయ స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పంటలకు బోనస్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని, కనీసం మద్దతు ధరకు కొనుగోళ్లు కూడా చేయలేకపోతే 60 లక్షల మంది రైతులకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు, రాస్తారోకో జరగని రహదారి లేదన్న కేటీఆర్… ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు కాంగ్రెస్ సర్కారుకు వాతలు పెడతారని అన్నారు. అన్నదాతల చేతిలోనే ఈ ప్రభుత్వ కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని, లేనిపక్షంలో చరిత్రలో రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఒక ఃరైతు ద్రోహిఃగానే మిగిలిపోతారని హెచ్చరికలు చేశారు.


