అమరావతి: రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వాతావరణ మార్పులతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమేనన్నారు. అక్కడక్కడా తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మంత్రి మాట్లాడారు. 48 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు, సాయంత్రం ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఎక్కడైనా ఒక ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించటానికి కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుందని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలోనూ ప్రాణాలు పణంగా పెట్టి విద్యుత్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తున్నారని చెప్పారు. సత్తెనపల్లిలో ఇద్దరు సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారని, ప్రజలు వాస్తవాలు అర్ధం చేసుకోవాలని అన్నారు. ఈదురుగాలులకు హోర్డింగ్‌లు, విద్యుత్ తీగల మీద పడి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్ప్పుకొచ్చారు. అనుమతులు లేని హోర్డింగ్‌లు తొలగించేందుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్ప్పుడు సమాచారం అందిస్తామని అన్నారు.
వినియోగం పెరిగింది…
అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి వివరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గత ఐదేళ్లలో ఒక్క సబ్‌స్టేషన్ కూడా నిర్మించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టిందని వెల్లడించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్‌మిషన్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఏపీలో నిమిషం కూడా విద్యుత్ కోత లేదని అన్నారు. సబ్‌స్టేషన్లు పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘1912’ టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి
- Advertisement -
RELATED ARTICLES


