తెహ్రాన్: ఒక వైపు ఆదిపత్యం…మరో వైపు ఆత్మ గౌరవం. ఈ రెండు కారణాలతోనే అమెరికా`ఇరాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. చిన్నోడికి చిన్న దెబ్బ…పెద్దోడికి పెద్ద దెబ్బ అన్నట్టుంది ఈ రెండు దేశాల యుద్ధ ప్రభావం. మేమెక్కడా తగ్గం అని ఇరాన్ ప్రతి దాడులతో నిలబడుతోంది. అమెరికా ఆధిపత్యానికి చిక్కకుండా పోరాటం సాగిస్తోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నా…ఇరాన్ ఒంటరిగానే అమెరికాకు ముఖ్యంగా ట్రంప్‌కు చెమటలు పట్టిస్తోంది. అమెరికా ఒకవైపు చర్చలు అంటూ మరోవైపు ఇరాన్‌పై తెగబడుతోంది. దీనికి ఇరాన్ తీవ్రంగా బదులిస్తోంది. దీనితో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ అధికారిక మీడియా కీలక ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చేశామని ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనను అగ్రరాజ్యం ఖండించింది. అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేసింది. శుక్రవారం తెల్లవారుజామున బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతంలో శత్రు దేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని అడ్డగించినట్లు తెహ్రాన్ మీడియా తెలిపింది. ఇరాన్ వైమానిక దళాలు ఆ ఫైటర్‌జెట్‌ను కూల్చివేశాయని స్థానిక గవర్నర్‌ను ఉటంకిస్తూ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా… లేదా అనే పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం బుషెహర్ ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని తెలిపింది. మరోవైపు, దాడుల్లో యుద్ధ విమానం కూలిపోతున్న ఓ ఫొటోను ఇరాన్ ఆర్మీ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అయితే, ఈ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. అసత్య ప్రచారాలని కొట్టిపారేసింది.
అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశాం: ఇరాన్
- Advertisement -
RELATED ARTICLES


