జూన్ 6, 7 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహణ
అనంతలో ఘనంగా గోడపత్రికల ఆవిష్కరణ
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జరగనున్న ఏడవ ప్రపంచ సాహిత్య మహాసభలకు తరలిరావాలని పలువురు కవులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో సుదీర్ఘ సాహిత్య యాత్రలో భాగంగా, ఈసారి రాజమహేంద్రవరంలో ఒక మహా సాహిత్య చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమవుతోందన్నారు. మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను శుక్రవారం అనంతపురంలో ఆవిష్కరించారు. శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు ఈ. గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ పతికి రమేష్ నారాయణ, హైకోర్టు న్యాయవాది, బిసిఆర్పీఎస్ అధ్యక్షులు సాకే నరేష్, కాకర్ల నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషకు విశేష సేవలందిస్తూ, సాహిత్య, సాంస్కృతిక రంగంలో నిరంతర కృషి చేస్తున్న చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. . కిమ్స్ ఫౌండర్ చైర్మన్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ చైతన్య రాజు సంపూర్ణ సహకారంతో నూతనోత్తేజం కలిగిందన్నారు. “తెలుగు భాష-తెలుగు కళలు-తెలుగు సంస్కృతి-తెలుగు వైభవం-తెలుగు సంప్రదాయాలు” అన్నీ ఒకే వేదికపై వికసించనున్న ఈ సకల కళల సృజనోత్సవం రెండు రోజుల పాటు జూన్ 6, 7 (శనివారం, ఆదివారం) తేదీలలో రాజమహేంద్రవరం, గోదావరి గ్లోబల్ యూనివర్సిటిలో ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ఈ మహత్తర సాహిత్య యజ్ఞానికి శ్రీశ్రీ కళావేదిక జాతీయ ప్రణాళికాధికారి, విశ్రాంత డిఈఓ, ప్రముఖ రచయిత డా. టి. పార్ధసారధి నేతృత్వంలో , జాతీయ అధ్యక్షురాలు, ఏపీ ప్రభుత్వ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కవయిత్రి గడ్డం ఈశ్వరీ భూషణం పర్యవేక్షణలో సాగనుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ కమిటీలు, పలు రాష్ట్రాలు, జిల్లా కమిటీల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక సాహిత్య , సాంస్కృతిక ఉద్యమంగా రూపుదిద్దుకుందన్నారు. గతంలో అంతర్వేది , తిరుపతి , తాడేపల్లిగూడెం (2 సార్లు ), మంచిర్యాల , ఏలూరులో ప్రపంచ సాహిత్య సభలు శ్రీశ్రీ కళావేదిక ఘనంగా నిర్వహించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1600 మంది కవులు, కళాకారులు, రచయితలు ఉచితంగా నమోదు చేసుకున్నారని వివరించారు.
7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు తరలిరండి
- Advertisement -


