అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డ్) నిబంధనల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వలసదారులు తప్పనిసరిగా అమెరికాను విడిచి స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని అమెరికా హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా స్పష్టం చేసింది.ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. గతంలో మే 21న అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక వలసదారులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను సమర్పించేందుకు స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని భావించబడింది.ఈ ప్రకటన వలసదారుల్లో ఆందోళన, గందరగోళానికి కారణమైంది. అయితే దీనిపై తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ వివరణ ఇచ్చింది.
ఇమిగ్రేషన్ అధికారులే నిర్ణయం
డీహెచ్‌ఎస్ తన తాజా ప్రకటనలో స్పందిస్తూ, ఇది ఎలాంటి విస్తృత స్థాయి విధాన మార్పు కాదని పేర్కొంది.గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అమెరికాలోనే ఉండి ప్రక్రియను పూర్తి చేయాలా లేదా స్వదేశానికి వెళ్లాలా అనే విషయాన్ని సంబంధిత ఇమిగ్రేషన్ అధికారి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారని వెల్లడించింది.ఈ విచక్షణాధికారం ఇమిగ్రేషన్ అధికారులకు ఎప్పటి నుంచో ఉందని, మే 21న విడుదల చేసిన మార్గదర్శకాల ఉద్దేశం కూడా ఆ అధికారాన్ని గుర్తు చేయడమేనని స్పష్టం చేసింది.
అనుమతి తప్పనిసరిగా పొందాలి
అలాగే శాశ్వత నివాస హక్కు కోసం దరఖాస్తు చేసిన వలసదారుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్న సమయంలో వారు అమెరికాలోనే కొనసాగేందుకు అనుమతి ఉంటుందని డీహెచ్‌ఎస్ వెల్లడించింది.
అయితే వీసా గడువు మించి అమెరికాలో ఉండటం (వీసా ఓవర్‌స్టే) లేదా ఇతర ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించిన అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకుంటారని కూడా సూచనప్రాయంగా పేర్కొంది.
ఈ తాజా వివరణతో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వలసదారుల్లో నెలకొన్న అనిశ్చితి కొంతవరకు తొలగినట్లైంది.


