విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలు శనివారం వడ్డెర కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వడ్డే ఓబన్న చిత్రపటాన్ని మేళతాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామంలో 1807 జనవరి 11న వడ్డే సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారన్నారు. శిస్తు వసూలు విషయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలేగాళ్లకు మధ్య ఘర్షణల సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న వీరోచితంగా పోరాడారన్నారు. సమాజ హితం కోసం వడ్డే ఓబన్న చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ వేడుకలలో అధిక సంఖ్యలో వడ్డెర సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు.