Homeజాతీయంవైభవ్‌ను స్లెడ్జింగ్‌ చేసినట్లు ఆరోపణలు..శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా!

వైభవ్‌ను స్లెడ్జింగ్‌ చేసినట్లు ఆరోపణలు..శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా!

- Advertisement -

వైభవ్‌ సూర్యవంశితో ఘర్షణకు దిగిన శ్రీలంక ఆటగాడు విషెన్‌ హలంబగే
అంపైర్ల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు
ఐపీఎల్‌ ప్రదర్శనలపై వైభవ్‌ను స్లెడ్జింగ్‌ చేసినట్లు ఆరోపణలు
సూపర్‌ ఓవర్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో మైదానంలో ఘర్షణకు దిగిన శ్రీలంక ‘ఏ్ణ ఆటగాడు విషెన్ హలంబగేపై ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ అందించిన అంపైర్ల నివేదిక ఆధారంగా హలంబగేకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఐసీసీ తరహాలో ఎలాంటి అధికారిక విచారణలు నిర్వహించకుండానే లంక బోర్డు నేరుగా ఈ శిక్ష ఖరారు చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ టై అవ్వడంతో సూపర్ ఓవర్‌కు దారితీయగా.. భారత్‌కు చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమైన దశలో వైభవ్ క్రీజులో ఉన్నాడు. అయితే ఆ తీవ్రమైన ఒత్తిడిలో వైభవ్ జట్టును గెలిపించలేకపోయాడు. భారత్ ఓడిపోవడంతో లంక ఆటగాళ్లు హద్దులు దాటి ప్రవర్తించారు.

నిరాశతో పెవిలియన్ వైపు నడుస్తున్న 15 ఏళ్ల వైభవ్‌ను లక్ష్యంగా చేసుకుని శ్రీలంక ఆటగాళ్లు అవహేళన చేయడం మొదలుపెట్టారు. దాంతో భారత ఆటగాడు సూర్యాంశ్‌ షెడ్గే రంగంలోకి దిగి లంక ప్లేయర్లను నిలదీశాడు. ఆ వెంటనే వైభవ్ కూడా ముందుకు రావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఈ ఘర్షణకు శ్రీలంక ఆటగాళ్ల అతి ప్రవర్తనే కారణమని భావించిన బీసీసీఐ వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తదుపరి మ్యాచ్‌కు అతడు ఆడేందుకు అవకాశం ఇచ్చారు.

కౌన్సిలింగ్ అవసరం
ఈ హై-వోల్టేజ్ డ్రామా నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌ల్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనప్పుడు ఆటగాళ్లు తమ భావోద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్చుకోవాలని చెప్పారు. ముఖ్యంగా యువ ఆటగాళ్ల ప్రవర్తనపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు