అంజన్ రాయ్
ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన. ఇది ఒక రకంగా మానసిక ఉపశమనంగానే కనిపిస్తోంది. అయితే ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం జరిగింది యుద్ధ చర్యలను నిలిపేసి, చర్చలను ప్రారంభించారు. కాబట్టి పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని చెప్పలేం. ఈ నేపథ్యంలో చమురు ధరలు తగ్గుతాయని ఆశావహులు ఎదురుచూస్తున్నారు..ఐతే బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఇంకా తగ్గే అవకాశం లేదని నిపుణులు చెప్తున్న మాట. ధర విషయం పక్కన పెడితె చమురు సరఫరా సాధారణ స్థితికి వచ్చినప్పుడే ఈ ప్రకటనకు ఒక అర్థం ఉంటుంది. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్‌లలో చమురు కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఒక దశలో ముడిచమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుంది. కాల్పుల విరమణ ప్రకటన రావడంతో ప్రస్తుతం ధరలు సుమారు 83.55 డాలర్లకు తగ్గాయి. ఐతే యుద్ధం మొదలు కావడానికి ముందు క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు కేవలం 70 డాలర్లే ఉండేది. ఈ ధరలు భారత్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దిగుమతి ఖర్చులు పెరగడంతో దేశీయ ద్రవ్యోల్బణం ఒత్తిడికి గురైంది. చమురు, సహజవాయువు కొరతపై ఉన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాల్లో అనిశ్చితిని పెంచేశాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హోర్మూజ్ జలసంధి గుండా జరుగుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ మార్కెట్‌లలో చమురు ధరలు భారీగా పెరిగాయి. శాంతి ఒప్పందం ప్రకటించిన తర్వాత కూడా ప్రపంచ ఆర్థిక వర్గాల్లో ఎలాంటి మార్పు ఇంకా రాలేదు. గత 31 ఏళ్లలో ఎప్పుడూ లేనిది జపాన్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును అత్యధిక స్థాయికి పెంచింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఎలా ఉంది అనేది దీని ద్వారా స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చాలాసార్లు కాల్పుల విరమణ, శాంతి ఒప్పందాల గురించి ప్రకటించారు మరో వైపు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ట్రంప్ శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు నమ్మే పరిస్థితికి ఇంకా రాలేదు. ఈసారి కూడా కాల్పుల విరమణకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వారం చివర్‌లో ప్రకటిస్తామని మాత్రమే తెలిపారు. దీన్ని బట్టి ఇంకా కొన్ని కీలకాంశాలు, వివాదాస్పద అంశాలు పరిష్కారం కాలేదని తెలుస్తోంది. రెండవ కారణం హోర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడమే. యుద్ధం మొదలవక ముందు ప్రపంచంలోని ఏ దేశ నౌకైనా హోర్మూజ్ గుండా ఇబ్బందులు లేకుండా ప్రయాణించేవి. ఇప్పుడు ఈ జలసంధిపై తనకున్న వ్యూహాత్మక ఆధిపత్యాన్ని గుర్తించిన ఇరాన్, నౌకల రాకపోకలకు వివిధ పేర్లతో రుసుములు విధించాలనే ఆలోచనలో ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ మార్గం గుండా ప్రయాణించేందుకు భారీ మొత్తాలు చెల్లించిన ఉదాహరణలు ఉన్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ సంకేతాల ప్రకారం, హోర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సముద్ర సేవల రుసుము, పర్యావరణ పరిరక్షణ రుసుము వంటి కొత్త చార్జీలు విధించే ఆలోచనలో ఉంది. నౌకలకు ప్రత్యేక బీమా రుసుములు కూడా వసూలు చేయాలని భావిస్తోంది. ఇది ఇప్పటివరకు సముద్ర బీమా రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న లండన్‌కు చెందిన లాయిడ్స్ వంటి పాశ్చాత్య ఆర్థిక సంస్థలకు ఎదురుదెబ్బగా మారవచ్చు. రుసుములు వసూలు చేసినప్పుడు సరుకు, చమురు రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి దాని ప్రభావం ప్రపంచ చమురు ధరలపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హోర్మూజ్ జలసంధి అందరికీ అందుబాటులో ఉండే అంతర్జాతీయ సముద్ర మార్గంగానే కొనసాగాలని భారత్ స్పష్టంగా కోరుతోంది. మూడవ ముఖ్యమైన అంశం హోర్మూజ్ జలసంధిని యుద్ధానికి ముందు ఉన్నట్లుగా పూర్తిగా సురక్షితమైన సముద్ర మార్గంగా మార్చడం. ప్రస్తుతం అక్కడ 100కు పైగా చమురు ట్యాంకర్లు చిక్కుకుపోయి బయటకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయి. ఈ యుద్ధం కారణంగా కొంతమంది నావికులు గాయపడగా, కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో నౌకలు దెబ్బతిన్నాయి. దీన్ని బట్టి పరిస్థితి మెరుగుపడిందని చెప్పలేం. మరో వైపు ఇరాన్ హోర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్లు అమర్చినట్లు తెలుస్తోంది . వీటిని తొలగించి నౌకా మార్గాలను సురక్షితంగా మార్చడం సవాలుతో కూడుకున్న అంశం. ఐతే స్టాక్ మార్కెట్‌లు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ, భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు ఇంకా తొలగిపోలేదు.స్టాక్ మార్కెట్‌లలో ఒడిదుడుకులు ఏర్పడితే, వాటి ప్రభావాన్ని ఎదుర్కోవడం వాస్తవ ఆర్థిక వ్యవస్థలో వచ్చే హెచ్చుతగ్గుల కంటే కష్టంగా ఉంటుంది. చమురు ధరలు పెరగడం లేదా సరఫరాలో కొరత ఏర్పడడం వల్ల కలిగే ప్రభావం కంటే, ఆర్థిక మార్కెట్‌ల అస్థిరత ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రమాదకర హెచ్చరిక అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లలో భారీ పతనాలు సంభవిస్తే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) తమ పెట్టుబడులను భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల భారత మార్కెట్‌లపై ఒత్తిడి పెరగడమే కాకుండా, రూపాయి మారకపు విలువ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 రూపాయల దిశగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) భారత మార్కెట్‌ల నుంచి వేగంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటే, రూపాయి మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. ఆర్థిక మార్కెట్‌లలో ఏర్పడే అస్థిరత దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రధాన మార్గం ఇదే. ఐతే ఈ అంశాలపై భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకులు నేరుగా దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు అవసరం. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని తగ్గించే బలమైన ఆర్థిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.


