అసెంబ్లీ వేదికగా పరస్పర నిందారోపణలు
చెన్నై: తమిళానాడు సీఎం విజయ్, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్దం మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా మంగళవారం నిర్వహించిన సమావేశాల్లో విజయ్ చేసిన ప్రసంగానికి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. విజయ్-సంగీత విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హిందీ వివాదం, నీట్, కరూర్ తొక్కిసలాట ఘటన, రైతుల నిరసన అంశాలను విజయ్ ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వాలని రైతులను సీఎం కోరారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ‘ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే రైతులు నిరసన తెలుపుతున్నారని విజయ్ పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చిన్న స్టోరీ చెప్తానంటూ…ఆయన చేసిన వ్యాఖ్యలు రైతుల గౌరవానికి భంగం కలిగించేవిగా ఉన్నాయి. చెంగల్పట్టు కోర్టులో భర్తకోసం భార్య వెతికే కథ మాత్రమే తమిళనాడు ప్రజలకు తెలుసు’ అంటూ ఉదయనిధి చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆగస్టు 7న తదుపరి విచారణ జరగనుంది. దీనిపై విజయ్ తన ప్రసంగంలో…డీఎంకే నేతృత్వంలోని గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నేతల మాదిరిగా తాము ఎన్నడూ ప్రజాధనాన్ని దోచుకోబోమని చెప్పారు.‘కేవలం ఒక కుటుంబానికే (డీఎంకేను ఉద్దేశిస్తూ) ప్రాధాన్యమివ్వడం మా రాజకీయ విధానం కాదు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి మా సేవలందిస్తాం. అదే మా రాజకీయం. అదే మా పాలనా విధానం’ అని పేర్కొన్నారు. అలాగే స్పీకర్ అనుమతితో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను అనుకరించారు. ఆ దృశ్యాలు నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సీఎం విజయ్-ఉదయనిధి మాటల యుద్ధం
- Advertisement -
RELATED ARTICLES


