Thursday, January 16, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీ వ్యాప్తంగా కోడి పందేల హోరు.. చేతులు మారిన వేల కోట్ల రూపాయలు!

ఏపీ వ్యాప్తంగా కోడి పందేల హోరు.. చేతులు మారిన వేల కోట్ల రూపాయలు!

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన కోడి పందేల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోనసీమ నుంచి రాయలసీమ వరకు రాష్ట్రం కోడిపందేలతో హోరెత్తింది. ఎక్కడ చూసినా పందేలు జాతరను తలపించాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క పందెమే రికార్డు స్థాయిలో రూ. 1.25 కోట్లు పలికింది. ఏలూరులో అయితే ఓ వ్యక్తి రూ. 2 కోట్ల పందేనికి సైతం సై అన్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో 1500కుపైగా బరుల్లో పందేలు జరిగాయి. కోడి పందేలకు తోడు గుండాట కూడా జోరుగా సాగింది. కాకినాడ జిల్లాల్లో గుండాట జోరుగా సాగింది. ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామంలో మూడు రోజులకు కలిపి ఓ నిర్వాహకుడు ఏకంగా రూ. 1.2 కోట్ల వ్యాపారం నిర్వహించాడు.

భోగి రోజు ఓ మాదిరిగా జరిగిన కోడి పందేలు సంక్రాంతి, కనుమ రోజు మాత్రం ఊపందుకున్నాయి. బరుల వద్ద ఇసుకేస్తే రాలనంతమంది కనిపించారు. బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఓ పేకాట శిబిరం వద్ద జూదరులను ఆకర్షించేందుకు నిర్వాహకులు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. శిబిరంలో కొత్తబట్టలు, నాటుకోడి పులుసుతో రాగిసంకటి, గారెలు సిద్ధం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కో పందెం రూ. 7 లక్షల వరకు చేరుకుంది. కొన్ని బరుల్లో మహిళా యాంకర్లు సందడి చేశారు.

పందేలపై పోలీసులు అక్కడక్కడ దాడులు చేయగా, చాలాచోట్ల వారు కనిపించలేదు. దీంతో పందేలు జోరుగా సాగాయి. తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లిలో గుండాటలో రూ. 200 గెలుచుకున్నప్పటికీ ఇవ్వకపోవడంతో కొమ్మిశెట్టి గంగాధర్ (18) అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాకినాడ జిల్లాలో కోడి పందేల్లో గెలిచిన వారు మహీంద్ర థార్ వాహనాన్ని సొంతం చేసుకున్నారు. చాలా బరుల్లో విజేతలు బైక్‌లను సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో జరిగిన పొట్టేళ్ల పందేలు ఆకట్టుకున్నాయి. తిరుపతి జిల్లాలోని ఎ.రంగంపేటలో నిన్న నిర్వహించిన జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. దీనిని తిలకించేందుకు వచ్చిన వారిని ఎద్దులు కుమ్మేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపురంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి సందడి చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు