వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కదలిన కర్షక దండు
‘కిసాన్ మహాపంచాయత్’కు దిల్లీ దిశగా కదం తొక్కిన రైతులు
అంబాలా (పంజాబ్): అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కర్షక లోకం గళమెత్తింది. ప్రతిపాదిత ‘అమెరికా-భారత్-వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రాజధాని ఢిల్లీ దిశగా కదం తొక్కారు. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ మంగళవారం దిల్లీలో తలపెట్టిన ‘కిసాన్ మహాపంచాయత్’కు బయల్దేరిన పంజాబ్ రైతులను పోలీసులు శంభు సరిహద్దుల్లో అడ్డుకున్నారు. ట్రేడ్ డీల్‌తో అమెరికా నుంచి వచ్చే కారుచౌక వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తుల కారణంగా…దేశంలోని రైతులు, పాడిరైతుల జీవితాలు దెబ్బతింటాయని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలిపేందుకు ‘దేశ్ బచావో మోర్చా’ నేతృత్వంలో దిల్లీలోని కిసాన్ఘాట్ వద్ద ‘మహా పంచాయత్’ నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ü నేత సర్వణ్ సింఘ్ పాంధర్ మాట్లాడుతూ అమెరికాతో జరుపుతున్న వాణిజ్య చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పారదర్శకతా పాటించట్లేదని…రైతులు, పాడి పరిశ్రమ కార్మికులు, లఘుపరిశ్రమలకు చెందినవారిని సంప్రదించకుండానే చర్చల్లో పాల్గొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలనూ బయటపెట్టాలని, ఈ డీల్ వల్ల దీర్ఘకాలంలో స్థానిక రైతులపై పడే ప్రభావం గురించి వివరణ ఇవ్వాలని ప్రధాని మోదీని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా నుంచి సోయాబీన్స్, మొక్కజొన్న, యాపిల్స్, బాదం, పత్తి, పాల ఉత్పత్తులు దేశీ మార్కెట్లను నష్టపరుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఎక్కువ శాతం మంది వ్యవసాయ, పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, ఈ ఒప్పందంతో అమెరికా ఉత్పత్తులతో మన రైతాంగం పోటీపడలేదన్నారు. తాము శాంతియుతంగా దిల్లీకి వెళ్దామనుకుంటే నాయబ్ సింగ్ సైనీ (బీజేపీ) ప్రభుత్వం తమను ఆపేసిందని పాంధర్ మండిపడ్డారు. ఎట్టిపరిస్థితిలోనూ ఆ ఒప్పందాన్ని సహించేది లేదని తెగేసి చెప్పారు. అమెరికా ట్రేడ్ డీల్‌పై భారత ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
అమెరికాతో వ్యాపారం రైతాంగానికి ముప్పు
- Advertisement -
RELATED ARTICLES


