Homeఅంతర్జాతీయంఇటలీకి స్పెయిన్ షాక్‌.. సరిహద్దుల్లో మళ్లీ తనిఖీలు

ఇటలీకి స్పెయిన్ షాక్‌.. సరిహద్దుల్లో మళ్లీ తనిఖీలు

- Advertisement -

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సభ్యదేశాలైన స్పెయిన్‌, ఇటలీ మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. తమ దేశ ప్రయాణికులపై ఇటలీ ఏకపక్షంగా సరిహద్దు తనిఖీలను అమలు చేయడాన్ని నిరసిస్తూ స్పెయిన్‌ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఆగస్టు 8, శనివారం నుంచి ఇటలీ నుంచి స్పెయిన్‌కు వచ్చే ప్రయాణికులపై తాత్కాలికంగా సరిహద్దు తనిఖీలను పునరుద్ధరించనున్నట్లు స్పానిష్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ తాత్కాలిక ఆంక్షలు సెప్టెంబర్‌ 7 వరకు అమల్లో ఉంటాయని స్పెయిన్‌ తెలిపింది. ఈ కాలంలో ఇటలీ నుంచి వచ్చే ప్రయాణికుల గుర్తింపు కార్డులు, ఇతర ప్రయాణ పత్రాలను పోర్టులు, విమానాశ్రయాల్లో యాదృచ్ఛికంగా తనిఖీ చేయనున్నట్లు వెల్లడించింది.

ముందస్తు సమాచారం లేకుండా నిర్ణయం
తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇటలీ సరిహద్దు తనిఖీలను ప్రవేశపెట్టడం అన్యాయమని, వివక్షాపూరిత చర్య అని స్పెయిన్‌ ఆరోపించింది. ఇటలీ తీసుకున్న నిర్ణయం ఈయూ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని ఇటలీని డిమాండ్‌ చేసింది. మరోవైపు స్పెయిన్‌ ఆరోపణలను ఇటలీ ప్రభుత్వం తోసిపుచ్చింది. జాతీయ భద్రత, సరిహద్దు నిర్వహణకు సంబంధించిన కారణాలతోనే తాత్కాలిక తనిఖీలు చేపడుతున్నామని స్పష్టం చేసింది. ఈ తనిఖీలు స్పెయిన్‌ నుంచి ఇటలీకి వచ్చే మూడో దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తాయని ఇటలీ తెలిపింది. స్పెయిన్‌, ఇతర ఈయూ దేశాల పౌరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది. ఈవిషయంలో ఎవరి ఒత్తిళ్లకూ, అల్టిమేటంలకూ తలొగ్గే ప్రసక్తే లేదని ఇటలీ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

స్యూటా వలసలే వివాదానికి కారణం
ఉత్తర ఆఫ్రికాలోని స్పెయిన్‌ ఆధీన ప్రాంతమైన స్యూటాకు జులై చివర్లో భారీ సంఖ్యలో వలసదారులు చేరడం ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. దాదాపు 80,000మంది వలసదారులు స్యూటాలోకి ప్రవేశించగా, వారిలో ఇంకా 3,000 నుంచి 5,000 మంది అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో మానవతా సంక్షోభం ఏర్పడింది. ఈ వలసదారుల సంక్షోభం నేపథ్యంలోనే ఇటలీ సరిహద్దు నియంత్రణలను ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే ఇటలీ నిర్ణయం స్పెయిన్‌లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. దీంతో ఇప్పుడు స్పెయిన్‌ కూడా ఇటలీ నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక సరిహద్దు తనిఖీలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే షెంజెన్‌ ప్రాంతంలో సరిహద్దు నిర్వహణపై ఈయూ సభ్యదేశాల మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రతరం అవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు