విశాలాంధ్ర, ఉరవకొండ: హంద్రీనీవా కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నింబగల్లు, వ్యాసాపురం తదితర గ్రామాల రైతులు గురువారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులు కార్యాలయంతో పాటు ప్రధాన రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. హంద్రీనీవా కాలువకు నీరు వస్తుందన్న ఆశతో మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలను సాగు చేశామని రైతులు తెలిపారు. అయితే అధికారులు కేవలం వారం రోజులపాటు నీటిని విడుదల చేసి, అనంతరం 34వ ప్యాకేజీ పరిధిలోని మోపిడి వద్ద డిస్ట్రిబ్యూటర్ను మూసివేశారని ఆరోపించారు. దీంతో కాలువ నీరు తమ పంట పొలాలకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నింబగల్లు, వ్యాసాపురం తదితర గ్రామాల కాలువ పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టామని, పలువురు రైతులు ఎకరాకు రూ.50 వేల వరకు కౌలు చెల్లించి సాగు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం నీటిని నిలిపివేస్తే పెట్టుబడులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఎస్సై హంద్రీనీవా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం కేవలం తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేస్తున్నామని, ఈసారి రైతులకు సాగునీరు అందించే పరిస్థితి లేదని అధికారి తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు. ఈ సమాధానంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని నిలిపివేస్తే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే హంద్రీనీవా నీటిని పంటలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
హంద్రీనీవా నీటి కోసం రోడ్డెక్కిన రైతులు..
- Advertisement -
RELATED ARTICLES


