Homeజాతీయంజంతర్‌ మంతర్‌ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

జంతర్‌ మంతర్‌ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

- Advertisement -

మహిళల ఫిర్యాదులపై హైప్రియారిటీ విచారణ

జంతర్‌ మంతర్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు,హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.మహిళలపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను ప్రత్యేక ప్రాధాన్యంతో పరిశీలించాలని సోమవారం హైపవర్డ్‌ ఎంక్వైరీ కమిటీని ఆదేశించింది.ఈ అంశంపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారాన్ని విచారించింది.జంతర్‌ మంతర్‌లో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసుల హింస,అధిక బలప్రయోగంపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మహిళల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
ఈ కమిటీ మహిళా నిరసనకారులపై జరిగినట్లు ఆరోపిస్తున్న హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన అంశాలను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సీజేఐ తెలిపారు.మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సీనియర్‌ న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.సోషల్‌ మీడియాతో పాటు ఇతర వేదికల్లో మహిళలు పోలీసుల చేత వేధింపులకు గురయ్యారన్న ఆరోపణలు వెలువడ్డాయని ఆమె తెలిపారు.బాధిత మహిళలు నేరుగా కమిటీకి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని శోభా గుప్తా కోరారు.ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు, అవసరమైతే జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫిర్యాదులను స్వీకరించే విధానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

నోడల్‌ అధికారుల ద్వారా ఫిర్యాదులు
ఈ అభ్యర్థనపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. మహిళలపై జరిగినట్లు ఆరోపిస్తున్న వేధింపులు, దాడులను ప్రాధాన్యంగా పరిశీలించాలని కమిటీకి ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టంగా సూచించినట్లు తెలిపారు.కమిటీ చైర్‌పర్సన్‌కు నోడల్‌ అధికారులను నియమించే అధికారం కూడా కల్పించినట్లు వెల్లడించారు.నోడల్‌ అధికారుల నియామకం పూర్తయిన తర్వాత బాధితులు తమ ఫిర్యాదులను ఎలా సమర్పించాలి, వాటిని ఏ విధానంలో స్వీకరించాలి అనే విషయాలను కమిటీ వెల్లడిస్తుందని సీజేఐ వివరించారు.తద్వారా మహిళా బాధితులకు ఫిర్యాదు చేసేందుకు స్పష్టమైన వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డి నేతృత్వంలో విచారణ
జంతర్‌ మంతర్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల హింస, నిరసనకారుల చర్యలపై వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో హైపవర్డ్‌ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది.మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది.పోలీసుల అధిక బలప్రయోగంతో పాటు మహిళా నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలను కూడా కమిటీ పరిశీలించనుంది.

త్వరితగతిన మధ్యంతర నివేదిక
మహిళా నిరసనకారులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సాధారణ ఫిర్యాదులుగా పరిగణించకుండా ప్రత్యేక ప్రాధాన్యంతో విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ అంశంపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

జంతర్‌ మంతర్‌ ఘటనల నేపథ్యంలో మహిళా నిరసనకారుల నుంచి వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు జోక్యం ప్రాధాన్యం సంతరించుకుంది.

బాధిత మహిళలు తమ ఫిర్యాదులను సులభంగా సమర్పించేందుకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపడం ఇప్పుడు హైపవర్డ్‌ కమిటీ ముందున్న కీలక బాధ్యతలుగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు