Homeజాతీయంహామీలు అమలు చేయరేం?

హామీలు అమలు చేయరేం?

- Advertisement -

కేంద్రం నమ్మకద్రోహం చేసిందని సీజేపీ ఆగ్రహం
సెప్టెంబర్ 5న దిల్లీలో నిరసనకు పిలుపు

న్యూఢిల్లీ: నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వరుస వైఫల్యాలు, పరీక్షల వ్యవస్థలో అవకతవకలపై దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా వేలాదిమంది యువత, విద్యార్థులతో కలిసి ఉద్యమించడం ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచిన కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ)… మరోసారి ఉద్యమానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి జులై 25న కేంద్ర ప్రభుత్వం తమకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని… దీనిపై సెప్టెంబర్ 5న శాంతియుత నిరసన మార్చ్ నిర్వహించను న్నట్లు సీజేపీ ప్రకటించింది. ఇండియా గేట్ నుంచి నూతన దిల్లీ పోలీస్ ప్రధాన కార్యా లయం వరకు ఈ మార్చ్ కొనసాగుతుం దని తెలిపింది. ఈ మార్చ్కు మరణించిన నీట్ బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు, జులై 20న జరిగిన ‘సంసద్ చలో’ మార్చ్‌లో పోలీసుల దాడులకు గురైన బాధితులు నాయకత్వం వహిస్తారని సీజేపీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత కూడా ఇందులో పాల్గొంటారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ హామీల అమలుపై సమీక్షించేందుకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్లను ఉపసంహరించడం లేదా కొట్టివేయడం, నీట్ బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడం వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని సీజేపీ మండిపడింది. ‘హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. సాంకేతిక అంశాల వెనుక దాక్కుంటూ స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదు’ అని సీజేపీ విమర్శించింది. ఆగస్టు 18న సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ల జాబితాను సమర్పించాలని కేంద్రాన్ని కోరిందని పేర్కొంది. వాటిని ఒకేసారి కొట్టివేసే అంశాన్ని కోర్టు పరి శీలించేందుకు ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. అయినప్పటికీ కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వడానికి నిరాకరించిందని ఆరోపించింది.
మా నమ్మకాన్ని బలహీనతగా భావించొద్దు
ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని బలహీనతగా భావించవద్దని సీజేపీ హెచ్చరించింది. ‘మా సద్భావనను ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసేందుకు అవకాశంగా మార్చుకోకూడదు’అని పేర్కొంది. జులై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి దేశవ్యాప్త ఉద్యమాన్ని విరమించామని… ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోందని భావించడం వల్లే తాము మళ్లీ వీధుల్లోకి రావాల్సి వచ్చిందని సీజేపీ తెలిపింది. మొత్తం యువత నమ్మకాన్ని ఉపయోగించుకుని వారిని ఇళ్లకు పంపించిన తర్వాత ప్రభుత్వం తన హామీల నుంచి వెనక్కి తగ్గడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 5న ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో యువత, విద్యా ర్థులు, విద్యార్థి సంఘాలు చేరుకుని శాంతియుత మార్చ్‌లో పాల్గొనాలని సీజేపీ పిలుపునిచ్చింది.
జూన్ 20న ప్రారంభమైన ఉద్యమం
పరీక్షల వ్యవస్థలో అవకతవకలు, నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశాలపై సీజేపీ జూన్ 20న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యమాన్ని ప్రారంభించింది. అనంతరం ఈ ఆందోళన దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిం చింది. జులై 20న పార్లమెంట్ వైపు సీజేపీ చేపట్టిన మార్చ్ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జికి పాల్పడి, బాష్పవాయు గోళాలు, పెల్లెట్ గన్స్‌ ప్రయోగించడంతో అనేకమంది నిరసనకారులు గాయపడ్డారు.
జులై 25న ఉద్యమం విరమణ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు, నీట్ అభ్యర్థులుగా ఉండి ఆత్మహత్య చేసు కున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ల ఉపసంహరణ తదితర డిమాండ్లపై ప్రభుత్వం అంగీకరించడంతో జులై 25న సీజేపీ ఉద్యమాన్ని విరమించింది. పరీక్షల వ్యవస్థలో విస్తృత సంస్కరణలపై తదుపరి చర్చలు జరపడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ఉద్యమ విరమణను ప్రకటించారు. అంగీకరించిన అంశాలను నిర్ణీత గడువులో అమలు చేస్తారన్న నమ్మకంతో “సద్భావనతో” ఉద్యమాన్ని విరమిస్తున్నామని వారు అప్పట్లో తెలిపారు. అప్పటి నుంచి ముఖ్యంగా నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్లను ఉపసంహరించడం, వారిపై తదుపరి చర్యలు లేకుండా రక్షణ కల్పించడం వంటి హామీల విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని సీజేపీ అనేకమార్లు ఆరోపించింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆగస్టు 18న విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్లను కొట్టివేసే ప్రక్రియకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని సీజేపీ ధ్వజమెత్తింది. జులై 25న ఇచ్చిన హామీలపై స్పష్టమైన పురోగతి లేకపోతే దేశవ్యాప్తంగా మరోసారి ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు