- కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ స్పష్టీకరణ
- శ్రీశైలం, సాగర్ జలాశయాల పంపిణీపై చర్చ
- అక్టోబరు వరకు 47 టీఎంసీలు కావాలన్న ఏపీ
- ఏడాది పొడవునా వాడకంపై ప్రతిపాదించిన తెలంగాణ
- నీటి ప్రవాహాలు పెరిగితే ఆలోచిద్దామన్న కమిటీ
- 4న మరోసారి సమావేశం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా కృష్ణా నదీ జలాలను తాగునీటి అవసరాల కోసం మాత్రమే విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన కేఆర్ఎంబీ సమావేశం సోమవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి, తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు సమావేశానికి హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై, ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకుగాను నీటి విడుదలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీని సమావేశ పర్చాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాయగా… తొలుత ఈ నెల 13న సమావేశమయ్యేందుకు తేదీని నిర్ణయించారు. తరువాత 17వ తేదీకి వాయిదా పడగా… ఏపీ శాసనసభ సమావేశాల కారణంగా మరోసారి వాయిదా కోరారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశమై శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై చర్చించారు. ఎల్నినో దృష్ట్యా జలాశయాల్లో ఉన్న నీటిని తాగునీటికే వాడుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కావాలని ఆ రాష్ట్ర ఈఎన్సీ ప్రతిపాదించారు. అలాగే ఏడాది మొత్తం నీటి వాడకం కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి కేటాయింపులకు మించి ఎక్కువ నీరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఏపీ ఈఎన్సీ సభ్యుడు నరసింహమూర్తి తెలంగాణ వాదనలను ఖండించారు. కేఆర్ఎంబీ నిర్ణయానికి అనుగుణంగా, తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం అక్టోబరు వరకు శ్రీశైలం, సాగర్ జలశయాల్లో తమకు 47 టీఎంసీలు కేటాయించాలని కోరారు. దీనికి త్రిసభ్య కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఏడాది పొడవునా 50 శాతం చొప్పున రెండు రాష్ట్రాలు వాడుకునేలా తెలంగాణ ఈఎన్సీ ప్రతిపాదించగా… త్రిసభ్య కమిటీ దానిని తోసిపుచ్చింది. తదుపరి సమావేశం సెప్టెంబరు 4వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున కేవలం తాగునీటి అవసరాలపైనే చర్చ ఉంటుందని సతీశ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నీటిప్రవాహాలు పెరిగితే మళ్లీ ఆలోచిస్తామని చెప్పారు.


