తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: రాష్ట్ర ఎన్నికల సంఘం
విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల తేదీలు, షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. వాట్సాప్తో సహా అనేక సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్స్ పూర్తిగా అబద్ధమని కమిషన్ సోమవారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. కొన్ని రోజులుగా ఎన్నికల సంఘం అధికారిక చిహ్నాలను, శాఖ పేరును అక్రమంగా ఉపయోగిస్తూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ నకిలీ షెడ్యూల్ను వాట్సాప్ గ్రూపులలో విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు సమాచారం వల్ల ప్రజలు, రాజకీయ వర్గాలు అయోమయానికి గురై, నిజానిజాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తున్నారని కమిషన్ తెలిపింది. ఈ రకమైన నకిలీ పుకార్లతో కూడిన సమాచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని, ఇతరులకు షేర్, సర్క్యులేట్ చేయవద్దని కమిషన్ విజ్ఞప్తి చేసింది. నకిలీ పోస్టులను తయారు చేసినా, వాటిని ప్రచారం చేసినా సైబర్ చట్టాలు, సంబంధిత నిబంధనల ప్రకారం వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్కి సం బంధించిన ఏ చిన్న అధికారిక సమాచారమైనా కమిషన్ ద్వారా నేరుగా నిర్వహించే అధికారిక ప్రతికా ప్రకటన, విలేకరుల సమావేశం ద్వారా మాత్రమే మీడియాకు, ప్రజలకు వెల్లడిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.


